Human Trafficking Charges : అమెరికాలో నలుగురు తెలుగు వ్యక్తుల అరెస్ట్

అమెరికాలో హ్యుమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతూ తక్కువ జీతానికి అమాయకులతో బలవంతంగా పనిచేయించుకుంటున్న నలుగురు తెలుగు వ్యక్తులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ కంపెనీలు సృష్టించి కొంతమందిని నిర్బంధించి పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు తేలింది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించారు. ప్రిన్స్‌టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిన్స్‌బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ వర్కర్ అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లో చాలామంది పనిచేస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 13న ప్రిన్స్‌టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక ఇలా పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్‌టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నలుగురిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలోని నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పనిచేయిస్తున్నారని బాధితులు చెప్పినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com