Gaza Rockets : సీన్ రివర్స్.. ఇజ్రాయెల్ పైకి హమాస్ రాకెట్ల వర్షం

దాడుల విరామానికి తిలోదకాలు ఇస్తూ హమాస్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఆదివారం రోజు ఇజ్రాయిల్ పైకి క్షిపణుల వర్షం కురిపించింది. హమాస్ కు చెందిన సాయుధ విభాగం అల్ ఖస్సమ్ బ్రిగేడ్ ఈ మేరకు ప్రకటన చేస్తూ టెల్ అవీవ్ నిరంతరంగా పాలస్తీనా పౌరులపై జరుపుతున్న ఊచకోతకు నిరసనగా భారీదాడికి పాల్పడినట్లు ప్రకటించింది.
గాజావైపు నుంచి శరపరంపరగా క్షిపణులు దూసుకురావడంతోనే ఇజ్రాయిల్ సైన్యం అప్రమత్తమై సైరన్లు మోగించింది. హమాస్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని ప్రకటించింది. దక్షిణ గాజాలోని రఫా వైపునుంచి కనీసం 8 క్షిపణులు దూసుకువచ్చాయని, వాటిని పేల్చేశామని వెల్లడించింది. కాగా హమాస్ దాడి ప్రారంభించిన వెంటనే టెల్అవీన్, పెటా టిక్వా, హెర్జియా నగరాల్లో సైరన్ల మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. రఫా మార్గం మీదుగా గాజాలోకి సహాయక పదార్థాలు, వస్తువులతోకూడిన వాహనాలు చేరిన తరువాత హమాస్ ఈ దాడికి పాల్పడింది.
ఈజిప్ట్ - అమెరికామధ్య కుదిరిన ఒప్పందంతో పలు వాహనాలు గాజాకు చేరాయి. ఆ వెంటనే దాడులు జరిగాయని తెలుస్తోంది. ఏడునెలల క్రితం హమాస్ వేలాది రాకెట్లతో దాడులు చేయడం అప్పట్లోనే సంచలనం రేపింది. వంద లాదిమంది ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా పెట్టుకున్న హమాస్ పై ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయిల్.. గాజాపై దాడులు చేసి మారణ హోమం సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com