పాకిస్తాన్ ఆరోపణలన్నీ అవాస్తవాలే.. భారత్

పాక్ విదేశాంగ కార్యదర్శి ఆరోపణలన్నింటినీ భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదం ఎక్కడ ఉందో, ఎక్కడ వ్యవస్థీకృత నేరాలు జరుగుతాయో ప్రపంచానికి తెలుసునని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ- చాలా దేశాలు పాకిస్థాన్ ఘోరాల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నాయి అని అన్నారు.
అంతకుముందు గురువారం మధ్యాహ్నం, పాకిస్తాన్ (Pakistan) విదేశాంగ కార్యదర్శి మహ్మద్ సైరస్ సజ్జాద్ ఖాజీ (Mohmad Sairas Sajjad khaaji) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇద్దరు పాకిస్తాన్ పౌరులను భారతీయ ఏజెంట్లు చంపినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రావల్‌కోట్, సియాల్‌కోట్‌లలో ఇద్దరు పాకిస్థానీ పౌరుల హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఖాజీ చెప్పారు. వారి పేర్లు షాహిద్ లతీఫ్, మహ్మద్ రియాజ్. గతేడాది ఇద్దరూ హత్యకు గురయ్యారు. కెనడా, అమెరికాలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అలాంటి పనిని భారత్ చాలా తెలివిగా చేపడుతోంది. ఈ హత్యలు కిరాయి వ్యక్తుల ద్వారా జరిగాయి. ఇందుకోసం అత్యాధునిక పద్ధతులను అవలంబించారు. అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ- పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపణలపై మీడియా నివేదికలను చూశాం. పాకిస్తాన్ భారతదేశ వ్యతిరేక ప్రేలాపనలు మళ్లీ ప్రారంభించింది. అయితే, ప్రపంచం మొత్తానికి నిజం తెలుసు అన్నారు.
జైస్వాల్ ఇంకా మాట్లాడుతూ- పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ఇతర నేరాలలో పాలుపంచుకుని ఉంది. దీనిపై భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్‌ను హెచ్చరించాయి. ఇప్పుడు పాకిస్థాన్ ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తోంది. దీనివలన ఏ సమస్యకు పరిష్కారం లభించదు అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com