US : ప్రపంచ భద్రత విషయంలో భారత్ మాకు కీలకం - అమెరికా

US : ప్రపంచ భద్రత విషయంలో భారత్ మాకు కీలకం - అమెరికా
X

ప్రపంచ భద్రత విషయంలో భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని అమెరికా ప్రతినిధుల సభకు చెందిన చైనా వ్యవహారాల సెలెక్ట్ కమిటీ స్పష్టం చేసింది. చైనా దురాక్రమణను నేరుగా ఎదుర్కొన్న దేశంగా భారత్ పాత్ర ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వత్రాతో చైనా కమిటీ అధిపతి జాన్ ములెనార్ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రపంచ భద్రతకు భారత్ కీలకం: చైనా దురాక్రమణ, దాని దౌర్జన్యాలను భారత్ నేరుగా ఎదుర్కొంది. అందుకే ప్రపంచ భద్రతలో ఆ దేశం అమెరికాకు ఎంతో ముఖ్యమైన భాగస్వామి అని ములెనార్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో రక్షణ పరిశ్రమ సంబంధాలు బలపడటం అమెరికా ప్రజల భద్రతకు కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రమాదకరమైన చైనా టెక్నాలజీ, సోషల్ మీడియా యాప్‌లను కట్టడి చేయడంలో భారత్ ఒక గ్లోబల్ లీడర్‌గా నిలిచిందని ములెనార్ ప్రశంసించారు. గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ టిక్‌టాక్‌తో సహా అనేక చైనా యాప్‌లను నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా కమిటీ గుర్తు చేసింది.

ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. కీలక తయారీ రంగాలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించడంపైనా ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. క్వాడ్ కూటమిని బలోపేతం చేయడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తులో ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఈ భాగస్వామ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భారత రాయబారి క్వత్రా కూడా పునరుద్ఘాటించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

Tags

Next Story