India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య

India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య
X
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిలుపు..

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్‌ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులతో సహా అన్ని మైనారిటీలను రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని భారత్ పిలుపునిచ్చింది. ‘‘బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీ నాయకుడు శ్రీ భబేష్ చంద్ర రాయ్ అపహరణ, దారుణ హత్యను మేము బాధతో గమనించాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

‘‘ ఈ హత్య బంగ్లాదేశ్ ప్రభుత్వ హయాంలో హిందూ మైనారిటీలను క్రమబద్ధంగా హింసించే విధానాన్ని కలిగి ఉందని, గతంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడినవారు శిక్షార్హత లేకుండా తిరుగుతన్నారు. ’’ అని జైస్వాల్ అన్నారు. ‘‘ ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సాకులు చెప్పకుండా, తేడాలు చూపకుండా హిందువులతో సహా అన్ని మైనారిటీలను రక్షించాలని బంగ్లా ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేస్తున్నామని భారత్ తన ప్రకటనలో పేర్కొంది.

గతేడాది, షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి హిందువులపై అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ దాడులకు పాల్పడుతున్నాయి. హిందువుల ఇళ్లు, ఆస్తులు, దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. గతేడాది, హిందు సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ని ఢాకా విమానాశ్రయంలో బలవంతంగా నిర్భందంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి భారత్ మైనారిటీల భద్రతపై బంగ్లాదేశ్‌ని హెచ్చరిస్తూనే ఉంది.

స్థానిక మీడియా ప్రకారం, బుధవారం సాయంత్రం ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోను బసుదేబ్‌పర్ గ్రామంలో తన ఇంటి నుంచి 58 ఏళ్ల భబేష్ చంద్ర రాయ్‌ని బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అతడిని నరబరి గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. రాయ్ అపస్మారక స్థితిలో ఇంటికి తిరిగి వచ్చారని కుటుంబీకులు స్థానిక మీడియాలో చెప్పారు. ఆ తర్వాత అతడిని దినాజ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం అక్కడ ఆయన మరణించినట్లు ప్రకటించారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు అనుమానితుల్ని గుర్తించలేదు.

Tags

Next Story