Strait Of Hormuz : ఇరాన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. సముద్రం మధ్యలో టోల్ ప్లాజా.. ఇక ప్రపంచ దేశాలకు చుక్కలే.

Strait Of Hormuz : ఇరాన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. సముద్రం మధ్యలో టోల్ ప్లాజా.. ఇక ప్రపంచ దేశాలకు చుక్కలే.
X

Strait Of Hormuz : అమెరికా, ఇరాన్ మధ్య 39 రోజుల పాటు సాగిన భీకర యుద్ధం ఎట్టకేలకు ఒక ఒప్పందానికి చేరింది. అయితే ఈ యుద్ధ విరామాన్ని వాషింగ్టన్ తన దౌత్య విజయంగా చెప్పుకుంటుంటే, ఇరాన్ మాత్రం తన నష్టాన్ని దీర్ఘకాలిక లాభంగా మార్చుకుంది. ఇరాన్ తన అగ్ర నాయకత్వాన్ని, సైనిక స్థావరాలను కోల్పోయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్విచ్ తన చేతుల్లోనే ఉందని నిరూపించుకుంది. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యాపార కోణం, ఇరాన్ వేసిన టోల్ టాక్స్ మాస్టర్ ప్లాన్ ఏంటో వివరంగా చూద్దాం.

ఇరాన్ కొత్త ఏటీఎం కార్డ్

ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో 20 శాతం కేవలం హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ దారిని మూసివేసి ఇరాన్ ప్రపంచాన్ని భయపెట్టింది. దీనివల్ల చమురు ధరలు మండిపోయి సరఫరా గొలుసు దెబ్బతిన్నది. అయితే ఇప్పుడు కుదిరిన శాంతి ఒప్పందంలో ఇరాన్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. ఈ అంతర్జాతీయ జలమార్గాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుని, ఇక్కడి నుంచి వెళ్లే వాణిజ్య నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంటే ఇకపై సముద్రం మీద కూడా మన హైవేల లాగా టోల్ గేట్లు ఏర్పాటు కాబోతున్నాయన్నమాట.

టోల్ టాక్స్ మోడల్

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. కొత్త ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ మీదుగా వెళ్లే నౌకలు అవి మోసుకెళ్లే సరుకు స్వభావం, పరిమాణాన్ని బట్టి ఇరాన్, ఓమన్‌లకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చుకోవడానికి, దేశ పునర్నిర్మాణం కోసం ఈ ఆదాయాన్ని వాడుకుంటామని ఇరాన్ వాదిస్తోంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇరాన్ సైన్యం పర్యవేక్షణలోనే నౌకలు వెళ్లాల్సి ఉండటంతో ఈ మార్గానికి ఇరాన్ ఒక రెగ్యులేటర్‎గా మారిపోయింది.

భారత్ లాంటి దేశాలపై పెను ప్రభావం

ఈ కొత్త టోల్ విధానం వల్ల షిప్పింగ్ కంపెనీల రవాణా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే ఆ భారం నేరుగా వస్తువుల ధరల మీద పడుతుంది. ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద తలనొప్పి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉంది. ఇరాన్ వేసిన ఈ ఎత్తుగడ వల్ల అంతర్జాతీయ వ్యాపారంలో ఒక కొత్త రిస్క్ ప్రీమియం వచ్చి చేరింది.

అమెరికా విజయం వెనుక అసలు నిజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తన విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే అది కేవలం ఒక ఆపరేషనల్ సక్సెస్ మాత్రమే. చమురు సరఫరా మళ్ళీ మొదలైందని అమెరికా సంబరపడుతోంది. కానీ ఇరాన్ దృష్టిలో ఇది ఒక స్ట్రక్చరల్ సక్సెస్. తన అత్యున్నత నాయకుడిని కోల్పోయినా, సైనిక స్థావరాలు ధ్వంసమైనా.. భవిష్యత్తులో తనకు భారీగా రాబడిని ఇచ్చే ఒక శాశ్వత ఆర్థిక వనరును సృష్టించుకుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇరాన్ తన స్వల్పకాలిక నష్టాన్ని భారీ లాభదాయకమైన దీర్ఘకాలిక ఆస్తిగా మార్చుకుంది.

Tags

Next Story