Israel : అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ పై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశం కాస్త వెనక్కు తగ్గింది. గతంలో బందీలుగా తీసుకెళ్లిన వారిలో 50 మందికిపైగా ఖైదీలను విడుదల చేసింది. గాజాలోనే అతిపెద్దదైన అల్- షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా కూడా ఉన్నారు. ఏడు నెలల క్రితం ఆయన ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కారు. సల్మియాతో పాటు విడుదలైన ఖైదీలను ఇజ్రాయెల్ తూర్పు సరిహద్దులోని ఖాన్ యూనిస్ మార్గం ద్వారా గాజాలోకి పంపారు.
ఇజ్రాయెల్ నుంచి విడుదలైన వారిని ఖాన్ యూనిస్ లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరింత మంది ఖైదీలను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఖైదీల విడుదలకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో అల్-షిఫా ఆస్పత్రి వార్తల్లో నిలిచింది. పసిబిడ్డలు సహా 179 మంది మృతులను ఇక్కడి ప్రాంగణం లోనే సామూహికంగా ఖననం చేసినట్లు ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా అప్పట్లో మీడియాకు వెల్లడించారు. అనంతరం అతడిని ఇజ్రాయెల్ సైన్యం కస్టడీలోకి తీసుకుంది. ఇప్పుడు రిలీజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com