Nigeria : నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్

నైజీరియాలో (Nigeria) మిలిటెంట్లు గురువారం 297 మంది పాఠశాల విద్యార్థులను సామూహికంగా కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల నుంచి భారీగా సొమ్ము గుంజడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కదున రాష్ట్రంలోని కురిగ టౌన్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తుపాకులతో బెదిరించి తమ వెంట తీసుకెళ్లారు. ఉదయం పాఠశాల ప్రారంభమయిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది.
ఇందుకు తమదే బాధ్యత అంటూ ఏ ముఠా కూడా ఇంతవరకు ప్రకటన విడుదల చేయలేదు. వారం రోజుల క్రితమే బోర్నో రాష్ట్రంలోని చిబోక్ టౌన్‌లో 200 మంది విద్యార్థినిలను ఇస్లామిక్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అది మరువక ముందే మళ్లీ సామూహిక కిడ్నాప్ జరగడం గమనార్హం. మహిళలను, పిల్లలను కిడ్నాప్ చేయడం 2014 నుంచి నైజీరియాలో పెద్ద సమస్యగా మారింది.
ముఖ్యంగా వాయువ్య, మధ్య రాష్ట్రాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఇక్కడ డజన్ల కొద్దీ ఉన్న సాయుధ ముఠాలు గ్రామాలపై పడి కిడ్నాప్‌లు చేస్తుంటాయి. దారిన వెళ్లే ప్రయాణికులను కూడా విడిచిపెట్టవు. భారీగా సొమ్ము ముట్టచెప్పితే తప్ప వారిని విడుదల చేయవు. దేశంలో శాంతి భద్రతలు ప్రమాదకరంగా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com