Nepal PM : అవిశ్వాసంలో ఓడిన నేపాల్ ప్రధాని పుష్ప.. ఓలికి గ్రీన్ సిగ్నల్

అస్థిర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నేపాల్ లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓటమిపాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయ్యింది. నేపాల్ లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనం.
నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 25, 2022లో పుష్ప కమల్ దహల్ ప్రచండ బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. అయితే, నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది.
నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో, సీపీఎన్-యుఎంఎలు 78 మంది సభ్యుల బలంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com