Nawaz Sharif: పాకిస్థాన్ ప్రపంచదేశాల ముందు అడుక్కుతింటోంది

Nawaz Sharif: పాకిస్థాన్ ప్రపంచదేశాల ముందు అడుక్కుతింటోంది
వీడియో లింక్ ద్వారా లాహోర్ లోని కార్యకర్తలతో సమావేశం

పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనేక కేసులు ఎదుర్కొంటూ, లండన్ లో ప్రవాసంలో ఉంటున్న నవాజ్ షరీఫ్... భారత్ పురోగమిస్తుంటే, పాకిస్థాన్ అంతకంతకు దిగజారుతోందంటూ సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. వీడియో లింక్ ద్వారా కార్యకర్తలతో సమావేశమయిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి 75 ఏళ్లు పూర్తయింది. ఈ 75 ఏళ్లలో భారత్ క్రమంగా అభివృద్ధి చెందుతుంటే పాకిస్థాన్ మాత్రం నానాటికీ పడిపోతూ ఉంటుంది. అయితే ఉగ్రవాదాన్నిపెంచి పోషించడం, అంతర్గత సంక్షోభం, ఆర్మీ తిరుగుబాటు ఇలా రకరకాల సమస్యలతో పాక్ సతమతం అవుతోంది. అయినా తీరు మార్చుకోకుండా భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో పాక్ ఒంటరిగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్కడి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. సొం దేశం పాక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతూ చంద్రుడిపై చంద్రయాన్ 3 ని విజయవంతంగా దించడం, ప్రతిష్ఠాత్మకమైన జీ 20 సమావేశాలకు అధ్యక్షత వహించడం వంటి చారిత్రాత్మక విజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరళ్లు, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు.


"ఇవాళ పాకిస్థాన్ ప్రధాని ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నారు. భారత్ ఇవాళ అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేస్తోంది. చంద్రుడ్ని అందుకుంది, జీ20 సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు?" అని సూటిగా ప్రశ్నించారు. గత కొన్ని ఏళ్ల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏటా పతనమవుతూ వస్తోందని.. ఇప్పుడు రెండంకెల ద్రవ్యోల్బణం రూపంలో పేద ప్రజలపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు.

నిధుల కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను పట్టుకొని వేడుకుంటోందని.. ఎందుకు భారత్ లాగా పాకిస్తాన్ ఘనతల్ని సాధించలేదని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితికి బాధ్యులు ఎవరు అని నిలదీశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు భారత్ ఖాతాలో కేవలం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేవని చెప్పారు. కానీ.. ప్రస్తుతం భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని తెలిపారు. భారత్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం నిధుల కోసం ప్రపంచం మొత్తం అడుక్కుంటూ తిరుగుతోందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story