బెలారస్‌కు అణ్వాయుధాలు తరలించాం
అనుకున్నట్టుగానే మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే రష్యా దేశ భూభాగానికి బెదిరింపు వచ్చినప్పుడు మా త్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ చెప్పారు.
బెలారస్ లోనే ఎందుకు
బెలారస్ రష్యాకు కీలకమైన మిత్రదేశం. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు ఇది లాంచ్‌ప్యాడ్‌గా పనిచేసింది. రష్యాకు చెందిన అణు క్షిపణులను బలారస్‌లో మోహరింపజేయాలని, అవి రష్యా నియంత్రణలో ఉండాలనే ఒక ప్రణాళికకు గతంలోనే ఇరు దేశాల నేతలూ ఒక అంగీకారానికి వచ్చారు. రష్యా, బెలారస్ కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం రుణాలు, రాయితీలపై చమురు, సహజవాయువులను సరఫరా చేయడం ద్వారా బెలారస్ ఆర్థిక వ్యవస్థకు రష్యా కాపుకాస్తుంది.
పొరుగు దేశం ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయడానికి ఒక అనువైన వేదికగా బెలారస్ భూభాగాన్ని రష్యా వినియోగించుకుంది. ఆ క్రమంలో భారీ ఎత్తున సైనిక బలగాలు, ఆయుధాలను అక్కడ ఉంచింది.వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను బెలారస్‌కు బదిలీ చేయడం వేసవి చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ చెప్పారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం గురించి ఫోరమ్ మోడరేటర్ అడిగినప్పుడు, పుతిన్ ఇలా సమాధానమిచ్చారు. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన మిస్సైళ్లు, బాంబులు వచ్చాయని, ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధికంగా శక్తిమంతమైనవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ధ్రువీకరించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై పడిన అణు బాంబు బరువు 15కిలో టన్నులు. ఆ బాంబు వల్ల లక్షా 46 వేల మంది మరణించారు. సాధారణంగా అణ్వాయుధాలతో భారీ వినాశనాన్ని సృష్టించవచ్చు. న్యూక్లియర్ వెపన్స్‌ను కిలోటన్నుల్లో పోలుస్తారు. ఒకవేళ వంద కిలోటన్నుల న్యూక్లియర్ బాంబు పేలితే దాదాపు 1.8 కిలోమీటర్ల దూరం వరకు పూర్తిగా నాశనం అవుతుంది. ఇక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు నష్టం తీవ్రంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం వరకు భారీ నష్టం ఉంటుంది. బాంబు పడిన ప్రదేశం నుంచి 8 కిలోమీటర్ల రేంజ్ వరకు ఏదో ఒక డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com