China-Tibet : మరోసారి తెరపైకి..చైనా-టిబెట్ వివాదం

చైనా-టిబెట్ మధ్య నెలకొన్న వివాదంపై చర్చల అంశం దశాబ్దం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. టిబెట్‌కు స్వయంప్రతిపత్తి ఇవ్వడం కుదరదని, అది చైనా రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆ దేశ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇది కాకుండా వేరే అంశాలపై బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతామని తెలిపింది. వేరే దేశాల్లో ఉన్న స్వయంపరిపాలన అధికారులతో సంప్రదింపులు ఉండబోవని పేర్కొంది.
చైనా-టిబెట్ మధ్య 13వ శతాబ్దం నుంచి వివాదం కొనసాగుతోంది. తమది స్వతంత్ర రాజ్యమని టిబెట్ అంటుండగా, తమ దేశంలోనే భాగమని చైనా వాదిస్తోంది. 1912లో 13వ దలైలామా టిబెట్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాలో అధికారంలోకి రాగానే రాజ్య విస్తరణ కాంక్ష పెరిగింది. 1950లో వేలాది మంది సైనికులతో టిబెట్‌పై దాడి చేసింది. 1951 మే 23న పూర్తిగా ఆక్రమించుకుంది.
టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న తర్వాత ఎన్నో ఆంక్షలు మొదలయ్యాయి. సైనికులు ఇతర దేశాలతో సంబంధాలను తెంచేశారు. టిబెట్ భాష, సంస్కృతి, మతం, సంప్రదాయం అన్నిటినీ లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి 14వ దలైలామాను బందీగా చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన 1959లో ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. కొన్ని వందలసార్లు చర్చలు జరిగినా పురోగతి లేదు. 2010 నుంచి చర్చలకు బ్రేక్ పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com