London : లండన్‌లో కత్తిపోట్లు.. పలువురికి గాయాలు
లండన్ ఈశాన్య ప్రాంతంలోని హైనాట్ ట్యూబ్ స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి కత్తితో అరాచకం సృష్టించాడు. థర్లో గార్డెన్స్ లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలపై, పోలీసు అధికారులపై దాడి చేశాడు. పసుపురంగు పుల్ ఓవర్ ధరించి, కత్తితో వచ్చిన ఆ వ్యక్తి థర్లో గార్డెన్స్ లోని ఓ ఇంట్లోకి వాహనంతో దూసుకు వెళ్లి పలువురిని కత్తితో పొడిచాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
36 ఏళ్ల నిందితుడు పలువురు వ్యక్తులపై, ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ఘటనను ఉగ్రవాదానికి సంబంధించినదిగా పరిగణించడం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు ఈ సంఘటన గురించి సమాచారం అందింది.
అగ్నిమాపక సిబ్బంది, పలు అంబులెన్స్ లతో సహా ఎమర్జెన్సీ సర్వీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కత్తి దాడితో గాయాల పాలైన వారిని, భయాందోళనలకు గురైన వృద్ధులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని బ్రిటన్ హోంశాఖ ప్రకటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com