Donald Trump : ఇస్లామిక్ ర్యాడికల్స్‌ను తరిమేస్తానంటూ ట్రంప్ సంచలన కామెంట్స్
2024 అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రచారంలో సంచలన హామీ ఇచ్చారు. అమెరికన్లను ఆకట్టుకునేందుకు మరో సంచలన ప్రకటన ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు. మిచిగాన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ట్రంప్, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుండి తరిమికొట్టే అధ్యక్షుడి కోసం నవంబర్ ఎన్నికల్లో ఓటు వేయాలని మద్దతు దారులకు పిలుపునిచ్చారు.
"మీరు వేలాది మంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను మన దేశంలోకి అనుమతించే అధ్యక్షుడిని గెలిపిస్తారో లేక రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుండి నరకంలోకి విసిరే అధ్యక్షుడిని ఎన్నుకుంటారో తేల్చుకోవచ్చు. నా కొత్త పరిపాలనలో మొదటి రోజున, మేము అమెరికన్ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ చర్యను ప్రారంభిస్తాం. మాకు వేరే మార్గం లేదు" అని నొక్కి చెప్పారు.
డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ వలసదారులు USకు రావడాన్ని సులభతరం చేశారనే వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. వలసదారుల నేరాలను "బిడెన్ వలస నేరం"గా ట్రంప్ అభివర్ణిస్తూ వస్తున్నారు. "మన దేశం ప్రస్తుతం ఉన్నంత ప్రమాదంలో మునుపెన్నడూ లేదు. వేలాది మంది ఉగ్రవాదులు అమెరికాలోకి చొచ్చు కొస్తున్నారు. ఇందుకు మనదేశం మూల్యం చెల్లించుకోబోతోంది" అని ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com