Shashi Tharoor ట్రంప్ హెచ్‌1బీ వీసా ఫీజు పెంపుకు అవే కీలకం - శశి థరూర్

Shashi Tharoor ట్రంప్ హెచ్‌1బీ వీసా ఫీజు పెంపుకు అవే కీలకం - శశి థరూర్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్ మాట్లాడుతూ.. "ట్రంప్ నిర్ణయాలు దేశీయ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. హెచ్‌1బీ వీసాల కారణంగా ఎక్కువ జీతాలున్న అమెరికన్ల కంటే తక్కువ జీతాలున్న భారతీయుల వైపే అక్కడి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది. అయితే ఫీజును లక్ష డాలర్లకు పెంచితే ఎక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే అమెరికాకు వస్తారని వారు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. కానీ దీనివల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌కు ఇవ్వవచ్చు" అని అన్నారు.

టారిఫ్‌ల అంశంపై స్పందన

అమెరికా భారత్ దిగుమతులపై సుంకాలు విధించడంపై కూడా థరూర్ మాట్లాడారు. అనేక సమస్యల పరిష్కారానికి సుంకాలు ఒక మాయా సాధనంగా ట్రంప్ భావిస్తున్నారని ఆయన అన్నారు. ఈ టారిఫ్‌ల ద్వారా వచ్చే ఆదాయంతో అమెరికాలో నెలకొన్న లోటును పూడ్చాలని ట్రంప్ ఉద్దేశం అయి ఉండవచ్చన్నారు. అయితే భారత్‌పై సుంకాల విధింపు, ట్రంప్ తరచూ చేసే ట్వీట్లు, ఆయన సలహాదారు నవారో అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని థరూర్ తెలిపారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత్‌కు కొంత ఎదురుదెబ్బేనన్నారు. అయితే ప్రస్తుతం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని తాను ఆశిస్తున్నట్లు థరూర్ వెల్లడించారు.

Tags

Next Story