Donald Trump : ట్రంప్ యూటర్న్.. గ్రాడ్యుయేట్ అయితే అమెరికా గ్రీన్ కార్డ్

Donald Trump : ట్రంప్ యూటర్న్.. గ్రాడ్యుయేట్ అయితే అమెరికా గ్రీన్ కార్డ్

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) విదేశీ విద్యార్ధులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డులు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై ఓ ఇంటర్వ్యూ లో అడిగి ప్రశ్నకు ట్రంప్ స్పందించారు.

ట్రంప్ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే అమెరికాల ఉండేందుకు వీలుగా డిప్లొమాతో ఓ పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నానని, ఇది రెండేళ్లు, నాలుగేళ్లు ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదన్నారు. జూనియర్ కాలేజీలకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజునే దీనిపై దృష్టి సారిస్తానని చెప్పారు.

కరోనా వైరస్ కారణంగా గతంలో దీన్ని అమలు చేయలేకపోయామని ఆయన చెప్పారు. వీసా సమస్యల కారణంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని చెప్పారు. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీలో ఉన్న ట్రంప్ ప్రచారంలో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఆయన ఈ సారి గ్రీన్ కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన చేశారు.

Tags

Next Story