USA : ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా.. భారత్ పైనా ప్రభావం

USA : ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా.. భారత్ పైనా ప్రభావం
X

అమెరికా ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తోంది. ఆర్ధిక నిపుణులు, సంస్థలు దీనిపై హెచ్చరిస్తూ వస్తున్నాయి. దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై సంకేతాలు ఇచ్చారు. ఆర్ధిక మాంద్యం రావచ్చని ఆయన అంగీకరించారు. ట్రంప్ ఆర్ధిక విధానాలు అమలు చేసేందుకు మాంద్యం వచ్చినా ఫర్వాలేదని ఆ దేశ ఆర్ధిక మంత్రి కూడా ప్రకటించారు. వరుసగా రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ప్రతికూలంగా నమోదైతే ఆ దేశ ఆర్థిక మాంద్యంలోకి ఉందని భావిస్తారు. జీడీపీతో పాటు నిరుద్యోగం, వ్యక్తిగత ఆదాయం, వినియోగదారుల వ్యయాలు, పారిశ్రామిక ఉత్పత్తి వంటివి ఎక్కువ కాలం క్షీణించవచ్చని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ కమిటీ తెలిపింది.

కరోనా సమయంలో 2 నెలల పాటు అమెరికాలో మాంద్యం ఏర్పడింది. అమెరికాలో జనవరి వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారుతున్నాయి. అమెరికాలో దిగుమతి అవుతున్న ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ ప్రతీకార పన్నులు వేస్తామని ప్రకటించడంతో, ఆయా దేశాలు కూడా ఇదే తరహాలో పన్నులు వేస్తామని హెచ్చరించాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్ 2 నుంచి భారత్పైనా ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీని వల్ల మన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా భారత్ మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. అమెరికాలో మాంద్యం వస్తే మాత్రం మన దేశంలో కొన్ని అంశాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని అంశాల్లో పరోక్షంగా ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయుల ఉద్యోగాలు పోతే దేశంలోకి వారు పంపించే రెమిటెన్స్ నిధులు ఆగిపోతాయి. రూపాయి మరింత ఒత్తిడికి గురవుతుంది. అమెరికాకు మన ఎగుమతులు తగ్గుతాయి. ఐటీ కంపెనీలపైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags

Next Story