విశాఖ ఘటనపై పొలిటికల్ ఫైట్.. వైసీపీకి చంద్రబాబు సవాల్

విశాఖ ఘటనపై పొలిటికల్ ఫైట్.. వైసీపీకి చంద్రబాబు సవాల్

విశాఖలో విష వాయువు లీకేజీ ఘటన తర్వాత ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతుల విషయంలో పొలిటికల్‌ ఫైట్‌ నడుస్తోంది. టీడీపీ హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే రుజువు చేయాలని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విశాఖ స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపైనే ప్రధానంగా చర్చించారు.

అరవై ఏళ్ల క్రితం నుంచి ఏయే ప్రభుత్వాలు ఎల్జీ పాలిమర్స్‌కు భూములు ఇచ్చాయో.. అనుమతులు ఇచ్చాయో మొత్తం సాక్ష్యాధారాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పాలి స్టైరిన్‌ విస్తరణ అనుమతులకు సంబంధించి కేంద్రానికి సిఫార్సు చేసిందనే దానిపై రుజువులు ఉన్నాయన్నారు. విష వాయువుల లీకేజీకి కారణమైన కంపెనీకి వత్తాసు పలుకుతూ బాధితులపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. దక్షిణ కొరియాలో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎంత పరిహారం ఇచ్చారో అంత మొత్తం ఇక్కడ కూడా ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ దుర్ఘటనకు జగన్‌, విజయసాయిరెడ్డి నైతిక బాధ్యత వహించాలన్నారు.. ఎల్జీ పాలిమర్స్‌ను తక్షణమే అక్కడ్నుంచి తరలించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.. ఆ భూముల్లో పార్క్‌ అభివృద్ధి చేసి పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంతకు ముందు విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో మృతిచెందిన వారికి నేతలంతా సంతాపం తెలిపారు.. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.. బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.. బాధితుల్లో భరోనా నింపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. వారి భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యం కోసం చేయగలిగిన సాయం చేద్దామని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story