AP: గుంటూరులో డయేరియాతో వరుస మరణాలు

AP: గుంటూరులో డయేరియాతో వరుస మరణాలు
భయంతో వణికిపోతున్న ప్రజలు....రెండు వారాల వ్యవధిలో నలుగురు మృతి

గుంటూరులో డయేరియా లక్షణాలతో మరణాల సంఖ్య పెరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండు వారాల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో కార్పొరేషన్‌ సరఫరా చేసే నీటిని తాగడానికే కాదు ఇతర అవసరాలకు వాడుకునేందుకు కూడా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంత్రి విడదల రజని మొదలుకొని కమిషనర్, ఇతర అధికారులు, ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు, మీడియా మీద విమర్శలు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.


కలుషిత తాగునీరు.. గుంటూరు వాసులపై పంజా విసురుతోంది. కాలనీల్లో ఏ ఇంట్లో చూసినా డయేరియా లక్షణాలైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారే ఉన్నారు. నాలుగైదు రోజులకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. డయేరియా అనుమానిత లక్షణాలతో ఇప్పటికే ముగ్గురు బలవగా ఆదివారం శ్రీనగర్‌ ఏడో లైన్లో నివాసం ఉంటున్న గాజుల సూర్యనారాయణ. మృతిచెందారు. 12వ తేదీన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న సూర్యనారాయణను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఫిబ్రవరి 7న తిరుమలాచారి కాలనీకి చెందిన కొర్రపాటి ఓబులు వాంతులు, విరేచనాలతో మరణించినా... అది డయేరియా కాదని అధికారులు తేల్చిచెప్పారు. మరో రెండు రోజుల తర్వాత శారదా కాలనీకి చెందిన పద్మ అనే యువతి డయేరియా లక్షణాలతో చనిపోయింది. రెండు రోజుల కిందట రైలుపేటకు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తి కూడా వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఇవేవీ డయేరియా మరణాలు కాదని మేయర్, నగరపాలక సంస్థ అధికారులూ కొట్టిపారేసినా 24 గంటలు గడవకముందే మరో వ్యక్తి మృతిచెందడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు... ఆదివారం మృతిచెందిన గాజుల సూర్యనారాయణ నివాసం ఉండే పక్క లైన్ శ్రీనగర్ 5వ లైన్‌లోనూ డయేరియా అనుమానిత మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాలంపాటి శంకర్ అనే బైక్ మెకానిక్ వాంతులు, విరేచనాలతో బాధపడుతూ... జీజీహెచ్‌లో ఈ నెల 9న మరణించారు. తన తండ్రి వాంతులు, విరేచనాలతోనే ప్రాణాలు కోల్పోయారని శంకర్ కుమారుడు తెలిపారు..

ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం గురించి ఏమాత్రం పట్టించుకోని అధికారులు... మనుషులు చనిపోయిన తర్వాత మాత్రం హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, కమిషనర్ సైతం మృతుడి నివాసం ఉండే శ్రీనగర్ కాలనీ 7వ లైన్ కు వచ్చి పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించారు కానీ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story