AP: అంగన్‌వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం

AP:  అంగన్‌వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం
మంత్రుల కమిటీ హామీలను అంగీకరించని అంగన్‌వాడీలు... ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపణ

అంగన్వాడీలతో జగన్‌ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు కొంత సమయం కావాలని మంత్రుల కమిటీ అంగన్వాడీలను కోరింది. సంక్రాంతి తర్వాత దీనిపై మరోమారు చర్చిద్దామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనతో అంగన్వాడీలు విభేదించారు. ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. నేడు MLAల నివాసాల వద్ద నిరసనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో నాల్గోసారీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో సర్కారు లేదని చర్చల్లో..మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ అమలు కోసం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని అంగన్వాడీలకు సూచించింది. సంక్రాంతి తర్వాత మరోమారు ఈ అంశంపై చర్చిద్దామని మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డి ప్రతిపాదించారు. సమ్మెవిరమించాలని కోరారు. లేకుంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని అంగన్వాడీలకు స్పష్టం చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే గర్భీణులు, పిల్లలకు బాలామృతం అందడం లేదన్నారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్నింటినీ ఆమోదించామన్నారు. సమ్మె వీడి విధుల్లో చేరాలని కోరినట్లు తెలిపారు..


అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష గట్టే వేతనాలు పెంచడం లేదని ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. చర్చల్లో సర్కారు ప్రతిపాదనలను మూకుమ్మడిగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని మంత్రి బొత్స చెప్పడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా అని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. నేడు శాసనసభ్యుల నివాసాల వద్ద నిరసనలకు దిగనున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వం కావాలనే అంగన్వాడీలను వేధిస్తోందని గుర్తింపు సంఘాల నేతలు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు అంగన్వాడీలకు మద్దతుగా ఉంటామన్నారు. ఉద్యమం ఉద్ధృతం కాకుండా ఉండాలంటే వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ వేతన పెంపు ప్రకటన చేయాలని అంగన్వాడీల నేతలు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తానని బీరాలు పలికిన జగన్‌, అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు. వారికి 4 వేల 200 ఉన్న గౌరవ వేతనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం..2 విడతల్లో 150 శాతం పెంచి 10 వేల 500 చేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ అయిదేళ్లలో పెంచింది కేవలం వెయ్యి మాత్రమే. తెలంగాణలో 2021 జులైలో అంగన్‌వాడీల వేతనాన్ని 13 వేల 500కి పెంచినాజగన్‌ స్పందించలేదు. మరోవైపు అంగన్‌వాడీల వేతనం 10 వేలకంటే ఎక్కువ ఉందని గ్రామీణ ప్రాంతాల్లో నవరత్నాల కింద ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హుల్ని చేసేశారు. లక్షకుపైగా ఉన్న అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి గోడూ వినే ఓపిక లేకపోయింది. పైగా వారిపైనే పోలీసుల్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొన్నిచోట్ల రాత్రిపూటా పోలీసుస్టేషన్లలో ఉంచారు. పనికి తగ్గట్టుగా తమకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని అమలుచేయాలని అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనను జగన్‌ ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story