AP: ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గని ఆందోళనలు

AP: ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గని ఆందోళనలు
కక్ష సాధింపులకు తలొగ్గేది లేదన్న అంగన్‌వాడీలు.. ఆందోళనలు ఉద్ధృతం

డిమాండ్ల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న తమపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదాన్ని మోపడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలను తీవ్రతరం చేశారు. 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బెదిరిస్తే.. రెట్టించిన పట్టుదలతో సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా తప్పుపట్టారు. విజయవాడలోని రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీ, కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు 24 గంటల రిలే దీక్షలు చేపట్టారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రేగులపాడుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్త... దీక్షా శిబిరంలోనే స్పృహ తప్పి పడిపోయారు. గుంటూరులో సమ్మె కొనసాగించిన అంగన్వాడీలు... ప్రభుత్వం అణచివేత ధోరణికి భయపడేది లేదని తేల్చిచెప్పారు


శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్‌కలెక్టర్‌ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు.. మంత్రి ఉష శ్రీచరణ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, అంగన్వాడీలకు మధ్య జరిగిన తోపులాటలో... వినుకొండ మండలం మరుగుపల్లికి చెందిన అంగన్వాడీ సహాయకురాలు నారాయణమ్మ అస్వస్థకు గురై కింద పడిపోయారు. అంగన్వాడీలను పట్టించుకోకుండా మంత్రి ఉష వెళ్లిపోవడంతో.. కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో అంగన్వాడీలు.. పొర్లుదండాలతో నిరసన తెలిపారు.

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు 24 గంటల రిలే దీక్షలు ప్రారంభించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది 26 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఎస్మాకు భయపడేదిలేదని..గుంటూరులో ఆందోళన చేసిన అంగన్వాడీలు స్పష్టంచేశారు. విజయవాడ దీక్షా శిబిరంలో ధర్నా కొనసాగించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రేగులపాడుకు చెందిన ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృహతప్పి పడిపోగా సహచరులు. ఆమెకు సపర్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ RDO కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కుర్చీలు నెత్తిన పెట్టుకొని నిరసన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.


కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఎస్మాను వెంటనే ఉపసంహరించుకోవాలనిలేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని శ్రీకాకుళంలో ఆందోళన చేసిన అంగన్వాడీలు హెచ్చరించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో సోది చెబుతూ నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్ వాడీలు, హెల్పర్లు నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story