AP TDP: పేదల ద్రోహీ జగన్‌కు.. ప్రజలకు మధ్య యుద్ధం

AP TDP: పేదల ద్రోహీ జగన్‌కు.. ప్రజలకు మధ్య యుద్ధం
జగన్‌ పేదలను బిచ్చగాళ్లను చేశాడన్న అచ్చెన్న... పేదలపై జగన్‌ది కొంగ జపమని విమర్శలు

పేదల ద్రోహి జగన్‌కి ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధమని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి... చెప్పిన అబద్దాన్నే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని మండిపడ్డారు. జగన్ రెడ్డి పేదల పేరుతో కొంగ జపం చేస్తూ కపట ప్రేమ చూపుతున్నాడంటూ విమర్శించారు. పేదలపై ప్రేమ నిజమైతే పేదల కోసం చంద్రన్న పెట్టిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారని అచ్చెన్నాయుడు నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు 1.14 లక్షల కోట్లను ఎందుకు మళ్లించారంటూ ప్రశ్నించారు.


బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత కోసి 16 వేల 800 రాజ్యాంగబద్ద పదవులను దూరం చేయడమేనా ఉద్దరించడమంటే అని అచ్చెన్నాయుడు నిలదీశారు. సలహాదారులు, వైస్ ఛాన్సులర్లు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీఐఐసీ లాంటి ఉన్నత పదవుల్లో బడుగులకు నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. నాసిరకమైన మద్యంతో 20వేల మంది పేదల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను రద్దు చేసి 125 కుల వృత్తుల వ్యాపారాలను దెబ్బతీశారన్నారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి పేద యువతకు నమ్మక ద్రోహం చేశారన్నారు. సంక్షేమ పథకాల మాటున పన్నులు, ఛార్జీల బాదుడు.... వాస్తవం కాదా అని నిలదీశారు. టీడీపీ సంక్షేమం పేదల్ని సొంత కాళ్లపై నిలబెడితే... జగన్ రెడ్డి పేదల్ని బిచ్చగాళ్లని చేశాడంటూ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డిని ఇక భరించలేమని రాష్ట్రంలోని పేదలంతా నినదిస్తున్నారని అన్నారు. ల్యాండ్-శాండ్-వైన్-మైన్ మాఫియాలకే జగన్ రెడ్డి కావాలి కానీ పేదలకు కాదని ఆక్షేపించారు. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు, పేదల ద్రోహి ఎవరూ లేరని లక్షల కోట్ల దోపిడీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు క్లాస్ వార్ చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.


ఆంధ్రప్రదేశ్‌కు తాను మళ్లీ ఎందుకు కావాలో జగన్ చెప్పిన వివరాలు విని నివ్వెరపోయామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుకు మళ్లీ రావాలా అంటూ నిలదీశారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాల్ని ముంచినందుకు మళ్లీ రావాలా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇంత దుర్మార్గపు పాలన ఎన్నడూ లేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story