చేతగానితనం, నిర్లక్ష్యంతో రైతులను ముంచేస్తున్నారు : చంద్రబాబు

చేతగానితనం, నిర్లక్ష్యంతో రైతులను ముంచేస్తున్నారు : చంద్రబాబు

నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ ఏడాది వరుసగా ఇది నాలుగో విపత్తు అని..ఈ ఖరీఫ్ లోనే వరుస విపత్తులతో 20లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. వరుస విపత్తులతో రైతాంగం తలడిల్లుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు.

విపత్తుల సమయంలో ప్రభుత్వం కనీసం ముందస్తు హెచ్చరికలూ చేయడం లేదని, ప్రజల్ని అప్రమత్తం చేయడంలేదని విమర్శించారు. అధికారులతో కనీసం సమీక్షలూ నిర్వహించడం లేదని మండిపడ్డారు. గత ఏడాది విపత్తు నష్టాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. ముందే అప్రమత్తం చేసి, తగిన జాగ్రత్తలు చెప్పి, సకాలంలో హెచ్చరికలు చేస్తే ఇంత నష్టం జరిగేది కాదన్నారు.

10జిల్లాలు, 300మండలాల్లో, 5లక్షల ఎకరాల్లో పంటలను తుపాన్ ముంచేసిందన్నారు. వరి, పత్తి, మిరప, పొగాకు, శనగ, వేరుశనగ, అరటి, మామిడి పండ్లతోటలు,ఉద్యానపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. తక్షణమే విపత్తు సాయం అందిస్తే రబీలో పెట్టుబడులకు రైతులకు అందివస్తుందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ఫిబ్రవరి దాకా ఇవ్వలేనని, పరిహారం కోసం 3నెలలు ఆగాలని సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు మాట్లాడటం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని అద్దం పడుతోందన్నారు.

సొంత మీడియాకు యాడ్స్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయిగాని, రైతులకు ఇవ్వడానికి చేతులు రావా..? అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. సర్కార్ చేతగానితనం, నిర్లక్ష్యంతో రైతులను ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విచ్చలవిడితనం వల్ల ప్రజలు మూల్యం చెల్లించాల్సివస్తోందన్నారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని చంద్రబాబు టిడిపి నాయకులు, కార్యకర్తలను ఆదేశించారు. బాధితులను ఆదుకోవాలని తక్షణ ఉపశమన చర్యలు చేపట్టి.. భవిష్యత్ పై భరోసా కల్గించాలన్నారు. జరిగిన విపత్తు నష్టంపై వివరాలు సేకరించి నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్లను వీడియో తీసి ఆధారాలతో నివేదికలను స్థానిక అధికారులకు అందజేయాలన్నారు.


Tags

Read MoreRead Less
Next Story