Chandrababu Deeksha: ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా విరుచుకుపడ్డ చంద్రబాబు..

Chandrababu Deeksha (tv5news.in)

Chandrababu Deeksha (tv5news.in)

Chandrababu Deeksha: టీడీపీ కేంద్ర కార్యాలయంపై, టీడీపీ నేతలపై దాడులను నిరసిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు.

Chandrababu Deeksha: టీడీపీ కేంద్ర కార్యాలయంపై, టీడీపీ నేతలపై దాడులను నిరసిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు.. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్షాస్త్రాన్ని సంధించారు. 36 గంటలపాటు చంద్రబాబు దీక్ష కొనసాగుతుంది. దీక్షా వేదికగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత.. పక్కా ప్రణాళికతో టీడీపీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ చర్యలు, రాష్ట్రంలో పరిణామాలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షాస్త్రాన్ని ప్రయోగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు, జిల్లా పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనలకు నిరసనగా ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆయన దీక్ష చేస్తున్నారు.. దీక్షా వేదికను కూడా వైసీపీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం మధ్యే ఏర్పాటు చేసుకున్నారు. మొదట ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన చంద్రబాబు.. ఆ తర్వాత దీక్షలో కూర్చున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

దీక్ష వేదికపై ప్రసంగించిన చంద్రబాబు ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా విరుచుకుపడ్డారు. పోలీసులకు చేతకాకపోతే ఇంటికెళ్లిపోవాలని, తమ రక్షణను తామే చూసుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న దాడిపై తక్షణమే స్పందించాలని అమిత్‌షాను కోరానన్నారు. రాష్ట్రం మొత్తం ఏకకాలంలో టీడీపీ ఆఫీసులు, నేతలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని గవర్నర్‌కు కూడా చెప్పామన్నారు. ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

ప్రభుత్వానికి నడపడం చేతకాకపోతే పోలీసు వ్యవస్థను మూసేయండని మండిపడ్డారు చంద్రబాబు. దాడి చేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీకి హ్యాట్సాఫ్ చెప్పాలా అని కామెంట్ చేశారు. పార్టీ ఆఫీసులోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామన్నారు చంద్రబాబు. ఆర్టికల్ 356ను సమర్ధించబోమని.. కానీ, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టే ఆర్టికల్ 356 పెట్టమంటున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు వాడిన భాషపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

మరోవైపు చంద్రబాబుకు సంఘీభావం తెలపడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివస్తున్నారు. జగన్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు జిల్లాల నుంచి తరలివస్తున్న నేతలు, కార్యకర్తలను పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. బారికేడ్లు పెట్టి మరీ రోడ్లను బ్లాక్‌ చేయడంతో టీడీపీ శ్రేణుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. దీక్షకు అనుమతి ఇచ్చిన పోలీసులే.. పార్టీ ఆఫీసుకి వెళ్లడానికి అనుమతి లేదని చెప్పడంపై టీడీపీ కార్యకర్తలు ఫైరయ్యారు.

మరోవైపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన దీక్ష 20నిమిషాలు ఆలస్యమైంది.. చంద్రబాబు వస్తున్న సమయంలోనే జగన్‌ కూడా వెళ్తుండడంతో కాన్వాయ్‌ రూట్‌ మార్చారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వాయ్ మళ్లించారు. దీంతో 20 నిమిషాలు ఆలస్యంగా దీక్షాస్థలికి చేరుకున్నారు చంద్రబాబు. ఇక శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

Tags

Read MoreRead Less
Next Story