షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారు : చంద్రబాబు

షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారు : చంద్రబాబు
జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత కర్నూలు పర్యటన టీడీపీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. నగరంలోని పెద్దమార్కెట్‌ నుంచి.. పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు.

వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారని చంద్రబాబు అన్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారని, మత సామరస్యం దెబ్బతిందని మండిపడ్డారు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ బాదుడు, సీ అవినీతి, డీ అంటే విధ్వంసమని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని నిలదీశారు.

వైఎస్ షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అందువల్లే షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందన్నారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

ఇసుక లేక రెండేళ్లుగా భవననిర్మాణ కార్మికులు వీధిన పడ్డారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కొత్త మద్యం అమ్ముతున్నారని, సొంత డిస్టలరీస్ పెట్టుకుని 5 వేల కోట్లు జలగల్లా పీలుస్తున్నారని విమర్శించారు. అమ్మఒడి అని చెప్పి నాన్న బుడ్డి ద్వారా మూడురెట్లు అధికంగా గుంజుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?' అని ప్రశ్నించారు. కర్నూలు కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు చంద్రబాబు.


Tags

Read MoreRead Less
Next Story