వైసీపీ అవినీతిని బయట పెట్టినందుకే మాజీ కానిస్టేబుల్ హత్య : చంద్రబాబు

వైసీపీ అవినీతిని బయట పెట్టినందుకే మాజీ కానిస్టేబుల్ హత్య : చంద్రబాబు

కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులో.. అక్రమాలు బయటపెట్టిన సీఆర్‌పీఎఫ్‌ మాజీ కానిస్టేబుల్‌ గురుప్రతాప్‌రెడ్డి హత్య కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వైసీపీ నేతల అవినీతిని బయట పెట్టినందుకే గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని తెలిపారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పేదలను హింసించడం, హతమార్చడం ఏపీలో సర్వ సామాన్యంగా మారిందని మండిపడ్డారు. నేరాల సంఖ్య పెరిగిపోతున్నా ప్రభుత్వం దృష్టిపెట్టక పోవడం గర్హనీయమని ధ్వజమెత్తారు. అల్లకల్లోలం చేసే యంత్రాంగాన్ని వైసీపీ నెలకొల్పినట్టు అనిపిస్తోందని విమర్శించారు. వైసీపీ అవినీతిపై ప్రశ్నించిన వారే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.

అటు.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపూర్ మండలం పెంజిఅనంతవరానికి చెందిన గురుప్రతాప్ రెడ్డి గతంలో సీఆర్‌పీఎఫ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేశారు. గ్రామంలో ఇసుక రీచ్‌లో అక్రమాలు, గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులో అవినీతిని గమనించారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 10లక్షల రూపాయల చొప్పున 677కుటుంబాలకు పరిహారం మంజూరు చేసింది. కానీ ఆ గ్రామంలోని కుటుంబాల సంఖ్య సుమారు 350మాత్రమే కాగా.... 677 కుటుంబాలు ఉన్నట్టుగా పరిహారం పంపిణీ చేశారు. అదనపు సొమ్మును స్వాహా చేశారు. సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ అయిన ప్రతాప్‌రెడ్డి.... అక్రమాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్‌, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి అక్రమాలపై నిజానిజాల నిర్ధారణకు డిప్యూటీ కలెక్టర్ రోహిణి ఇద్దరు తహసీల్దార్లతో పాటు నవంబర్ 13న గ్రామసభ నిర్వహించారు. పరిహారం చెల్లింపు జాబితాలో సుమారు 300 మంది అనర్హుల పేర్లు చేర్చారని గురుప్రతాప్ రెడ్డి గ్రామసభలో చెప్పారు. ఈ సమయంలోనే కొందరు సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అనంతరం... అదే రోజు గ్రామసభ నిర్వహించిన ఆలయ ప్రదేశంలోనే గురుప్రతాప్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.

గురుప్రతాప్‌రెడ్డి హత్యను.. ఫాక్షన్ హత్యల్లో భాగంగా చిత్రించాలని ప్రభుత్వమే చూస్తోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అవినీతి కుంభకోణాన్ని వెల్లడించడం వల్ల.. ప్రజాధనం భారీ ఎత్తున స్వాహా చేయడాన్ని బయట పెట్టడం వల్ల జరిగిన హత్య అని వివరించారు. గురుప్రతాప్‌రెడ్డి ఒక విజిల్ బ్లోయర్‌గా గండికోట రిజర్వాయర్ ముంపు బాధితుల పరిహారం చెల్లింపులో అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టారని తెలిపారు. గురుప్రతాప్‌రెడ్డి బాధ్యత గల పౌరుడిగా దేశం పట్ల తన విధి నిర్వర్తించారని చంద్రబాబు పేర్కొన్నారు. అవినీతి కుంభకోణాల్లో హత్యలు జరిగే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే.. ఇక రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు ఏ స్థాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లేఖను ఏపీ విజిలెన్స్ కమిషనర్‌, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ ప్రతుల్ని పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story