JAGAN: కాస్త ముందుగానే ఎన్నికలు: జగన్‌

JAGAN: కాస్త ముందుగానే ఎన్నికలు: జగన్‌
20 రోజుల ముందే రావచ్చన్న ముఖ్యమంత్రి....సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచన

శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశం సందర్భంగా సీఎం జగన్‌ మంత్రులతో కీలక విషయాలను వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఈసారి కాస్త ముందుగానే రావచ్చన్నారు. 10 రోజులో, 20 రోజులో ఎన్నికలు ముందుకు రావచ్చన్నారు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు ఎదురవ్వచ్చని అంచనా వేస్తున్నారు కాబట్టి కేంద్రం కూడా ఆ సమయంలో కాకుండా కొంతముందే ఎన్నికలకు వెళ్లడానికి అవకాశం ఉండొచ్చని మంత్రులతో జగన్ అన్నట్లు తెలిసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే మన వరకు సిద్ధమయ్యామని మంత్రులతో సీఎం అన్నారు. 3 వేల చొప్పున పింఛన్‌ పంపిణీ సహా ఫిబ్రవరి మొదటి అర్ధభాగంలోపు అన్ని సంక్షేమ పథకాలనూ పూర్తిచేసేస్తామని చెప్పారు. మంత్రులంతా ఇకపై క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలని జగన్‌ సూచించారు.


జిల్లాల్లో పార్టీ బాధ్యత మీదే అని స్పష్టం చేశారు. చాలారోజుల తర్వాత మంత్రిమండలి సమావేశం మూడున్నర గంటలకుపైగా సాగింది. గంటన్నరకుపైగా ఒక్క ఆరోగ్యశ్రీ పథకం పైనే చర్చించారు. రేపు ఎన్నికల్లో ఆరోగ్యశ్రీ మనకు గొప్ప ప్రచారాస్త్రం అని జగన్‌ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచుతున్నామని ఈ నెలలోనే అమల్లోకి తేబోతున్నామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన కొత్త కార్డులను ఈ నెల 19 నుంచి వారం రోజులు నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలని నిర్దేశించారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో ఆరోగ్యశ్రీకి 5,000 కోట్లు ఖర్చు చేస్తే.. మనం ఈ సంవత్సరంలోనే 4,000 కోట్లు వెచ్చించబోతున్నామని.. మంత్రులకు సీఎం జగన్‌ చెప్పారు. ఈ వివరాలను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని... ఉద్బోధించారు. శుక్రవారంనాటి భేటీలో పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు, ఎన్నికలకు సన్నద్ధతపై సీఎం స్పష్టత ఇస్తారేమో అని సమావేశానికి ముందు మంత్రులు మాట్లాడుకున్నారు.

కానీ, అధికారులు వెళ్లిపోయాక ఇప్పుడు ఇక్కడ వేరే విషయాలు మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీని వదిలేసి వాటి గురించే బయటకు వెళ్లి చెబుతారు కాబట్టి ఇప్పుడలాంటి మాటలేవీ వద్దని అర్ధంతరంగా సమావేశం ముగించి జగన్‌ వెళ్లిపోయారని తెలిసింది. కేబినెట్‌ భేటీ నుంచి బయటికొస్తున్నపుడు కొందరు మంత్రులు ఆరోగ్యశ్రీనే ఎన్నికలకు ప్రధానాస్త్రం అని సీఎం చెప్పిన దానిపై మాట్లాడుకున్నారు. పరిమితిని 25 లక్షలకు పెంచామని జనంలోకి వెళ్లడం కాదు ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు వెళితే డబ్బు కడితేనే..వైద్యం చేస్తామంటున్నారని బాధితులు రోజూ మా వద్దకు వస్తున్నారు. ఈ పరిస్థితిని సరిచేయకుండా ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీ కార్డు అంటూ జనంలోకి వెళితే అంతే సంగతి అంటూ తలలు పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story