YCP: ఓట్ల అక్రమాలకు తెరలేపిన వైసీపీ

YCP: ఓట్ల అక్రమాలకు తెరలేపిన వైసీపీ
ప్రతిపక్షాల ఆరోపణలు.... ఓటర్‌ జాబితాపై దరఖాస్తుల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఇప్పటినుంచే అక్రమాలకు తెరతీసింది. ఇబ్బడిముబ్బడిగా దొంగ ఓట్లు చేర్చుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. NTR జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఓటర్ జాబితా తప్పులతడకగా ఉందంటూ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బోగస్‌ ఓట్లు బయటపడుతున్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. NTR జిల్లా పెద్దాపురంలో తెలంగాణకు చెందిన వారి పేర్లు ఏపీ ఓటర్ జాబితాలో వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఒకే గ్రామంలో దాదాపు 50 మంది పేర్లు బయటపడ్డాయి. వీరంతా వైసీపీ సానుభూతిపరులేనని విపక్ష నేతలు తెలిపారు. ఈ ఓట్లు తొలగించాలని అర్జీలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.


వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఓటును రెండు గ్రామాల్లోనూ నమోదు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంచికచర్ల మండలం గని ఆత్కూరులోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఈ విధంగా మార్చారు. ఇప్పటికీ వీటిని యథాతథంగా ఉంచేశారు. అదే విధంగా కొత్తకంచల గ్రామంలోని ఓట్లు తుర్లపాడుకు తుర్లపాడు ఓట్లు కొత్త కంచల గ్రామంలోని పోలింగ్‌ కేంద్రానికి మార్చారు. చందర్లపాడులో తొమ్మిది పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఓట్లను ఓటర్లు ఉండే ప్రాంతాల పోలింగ్‌ కేంద్రాల నుంచి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయటంతో ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీనివల్ల కుటుంబసభ్యుల పేర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో తమ ఓటు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.ఇదే పరిస్థితి జజ్జూరు, అల్లూరు, పెద్దాపురం చౌటపల్లి, జయంతి, వీరులపాడు పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఉంది. దీనిపై అభ్యంతరాలు ఇచ్చినా అధికారులు పరిష్కరించట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఓటర్ జాబితాలో అక్రమాలపై ఇప్పటివరకు 5759 అర్జీలు రాగా వీటిల్లో కొన్నింటిని పరిష్కరించగా మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణలో ఓటుహక్కు ఉన్నవారు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో మళ్లీ ఓటు హక్కు పొందారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా నుంచే ఈ దొంగ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరుల్లో సైతం భారీగా దొంగ ఓట్లు చేర్చారని తెలుస్తోంది. దొంగఓట్లపై స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సంఘం స్పందించకుంటే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా చేర్చుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story