AP: సీఏ వృత్తికే మచ్చ తెచ్చిన విజయసాయిరెడ్డి

AP: సీఏ వృత్తికే మచ్చ తెచ్చిన విజయసాయిరెడ్డి
విజయసాయి తప్పు చేసినట్లు నిరూపితమైందన్న ICAI.... స్టే ఎత్తేయాలని హైకోర్టులో పిటిషన్‌

గౌరవప్రదమైన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వృత్తిలో ఉంటూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యహరించారని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఆయనపై I.C.A.I క్రమశిక్షణ కమిటీ మూడుసార్లు వేర్వేరుగా విచారణ జరిపినా ఆయన తప్పు చేసినట్లు నిరూపితమైందని తెలిపింది. దీనిపై విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు జారీ చేసినా తెలంగాణ హైకోర్టు ద్వారా ఆయన స్టే తెచ్చుకున్నట్లు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన I.C.A.I విజయసాయిరెడ్డి ఏవిధంగా వృత్తిపరమైన దుష్ప్రపవర్తనకు పాల్పడిందో వివరిస్తూ స్టే ఎత్తివేయాలని కోరింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తమ క్రమశిక్షణ కమిటీ నిర్థరించందని I.C.A.I తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీఎం జగన్‌, ఆయన గ్రూప్ సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ముడుపులను పెట్టుబడులుగా మళ్లించడంలో కీలకపాత్ర పోషించారని I.C.A.I తెలిపింది. ఈ మేరకు ఐసీఏఐ క్రమశిక్షణ డైరెక్టరేట్ మూడుసార్లు అధ్యయనం చేసిందని ఇందులో ఆయన వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు అధికారులు ఏకాభిప్రాయంతో నివేదికలు అందజేశారని తెలిపింది.


విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారించాల్సి ఉన్నందున .గతేడాది నవంబర్ 3న విచారణను నిలిపిస్తూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ హైకోర్టును I.C.A.I కోరింది. తెలంగాణ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. చార్టర్డ్‌ అకౌంటెంట్ వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై విచారణకు హాజరుకావాలంటూ గతేడాది అక్టోబర్ 23న I.C.A.I విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసి ఆయన స్టే పొందారు. దీనిపై I.C.A.I హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. I.C.A.I సంస్థ చెన్నైలో ఉందని విజయసాయిరెడ్డి కార్యాలయం సైతం అక్కడే ఉందని కౌంటర్‌లో పేర్కొంది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చెన్నై వేదికగానే కొనసాగాయి. కాబట్టి విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని తెలిపింది.

విజయసాయిరెడ్డి పై క్రమశిక్షణ చర్యలు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ చట్ట నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపింది. తప్పుచేసినట్లు ఇంకా ధ్రువీకరించ లేదని విచారణ ప్రారంభ దశలో ఉండగా కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా ఉత్తర్వులు వచ్చినా అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించొచ్చని కౌంటర్‌లో పేర్కొంది. ఇదే వ్యవహారంలో 2015లోనూ విజయసాయిరెడ్డి ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు I.C.A.I క్రమశిక్షణ డైరెక్టరేట్ విచారణ చేపట్టి ప్రాథమిక అభిప్రాయాన్ని 2017, 2021, 2022లో క్రమశిక్షణ కమిటీకి అందజేసింది. మూడుసార్లు 3 వేర్వేరు అధికారులు అభిప్రాయాలు ఇచ్చినా...విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నివేదిక అందజేశారని I.C.A.I సంస్థ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story