Tractor : వామ్మో.. ట్రాక్టర్లు లీజుకు తీసుకుని అమ్మేశారు

Tractor : వామ్మో..  ట్రాక్టర్లు లీజుకు తీసుకుని అమ్మేశారు

రైతుల నుంచి ట్రాక్టర్లను లీజుకు తీసుకుని, అమ్మేసిన ఘరానా ముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.4.50కోట్ల విలువైన 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. జిల్లాలోని నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన రవికుమార్‌, కడప జిల్లా పులివెందుల పట్టణ వాసి బయారెడ్డి, అదే జిల్లా సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన కాకర్ల హాజీపీరాను అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.

వీరంతా ముఠాగా ఏర్పడి కడప జిల్లా ప్రొద్డుటూరులోని ఇటుకల ప్యాక్టరీలో పని నిమిత్తం ట్రాక్టర్లు కావాలంటూ శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రైతులను సంప్రదించారు. ప్రతినెలా రూ.25 వేల లీజు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు నెలలపాటు లీజు సక్రమంగా చెల్లించారు. తీసుకున్న ట్రాక్టర్లను ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. కొనుగోలుదారులకు అగ్రిమెంట్‌ రాసిచ్చి, తరువాత రిజిస్ట్రేషన్‌ చేసిస్తామని నమ్మబలికారు.

ఫిబ్రవరి నుంచి వారు కనబడకుండా పోయారు. ఫోన్లు స్విచ్చాఫ్‌ రావడంతో ట్రాక్టర్లను లీజుకిచ్చిన రైతుల్లో కొందరు తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరికొన్నిచోట్ల ఇలాంటి ఫిర్యాదులే రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు బృందంగా ఏర్పడి.. రవికుమార్‌, బయారెడ్డి, కాకర్ల హాజీపీరాను అరెస్టు చేశారు. వారు తెలిపిన సమాచారం మేరకు కడప, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో విక్రయించిన 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story