YCP: ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీలోనూ విభేదాలు భగ్గుమన్నాయా?

YCP: ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీలోనూ విభేదాలు భగ్గుమన్నాయా?
YCP: విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బకి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

YCP: ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీలోనూ విభేదాలు భగ్గుమన్నాయా? సొంత పార్టీ నేతల మధ్య మాటల తూటాలకు కారణమేంటి? ఆధిపత్య పోరు దేనికి సంకేతం? బలహీన వర్గాల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల.. అగ్రవర్ణాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కారణమేంటి? ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లలో అగ్రవర్ణాల నేతలదే ఆధిపత్యమా? అధిష్ఠానం వ్యూహం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బకి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవ‌లే వైసీపీ జెండా క‌ప్పుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్ అల‌క‌బూనారట. ఇక మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి.. స్థానిక వైసీపీ నేత‌ల‌కి మ‌ధ్య చాలా రోజుల నుంచి వివాదాలు న‌డుస్తూనే వున్నాయనే చర్చ పార్టీలోనే నడుస్తోంది.

విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు తీరు వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఆడారి ఆనంద్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులకు మధ్య విభేదాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాయకరావుపేట నియోజకవర్గంలో రాజకీయం సెగలు కక్కుతోంది.

ఇక గాజువాకలో ఒక్క ఛాన్స్ అంటూ గెలిచిన తిప్పల నాగిరెడ్డి.. ఇప్పుడు ముఖం చాటేసి.. తన కొడుకులకు అనధికారంగా పగ్గాలు అప్పగించి విమర్శల పాలువుతున్నారనే టాక్ ఉంది. అటు పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిపై పార్టీ శ్రేణుల నుంచి అసంత్రుప్తి పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నర్సీపట్నం వైసీపీలోనూ అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.?

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ హ‌వాకి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న శ్రీనుని జ‌గ‌న్ పావులా వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లలా రాజకీయం రాజుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణకు.. చిన్న శ్రీను మొన్నటిదాకా రైట్ హ్యాండ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు అడ్డం తిరిగి వేరు కుంపటి పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

విజయనగరంలోని వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు.. జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీనుకు మధ్య పొసగడం లేదనే టాక్ ఉంది. మరోవైపు కురుపాం సెగ్మెంట్లో మామలు వర్సెస్ కోడలు అనేలా పరిస్థితి తయారైంది. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి, ఆమె సొంత మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, పెద మామ శత్రుచర్ల విజయరామరాజుకు మధ్య పొసగడం లేదని టాక్ వినిపిస్తోంది.

దీంతో ఆమె సొంత మామ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన కృష్ణదాసు వ‌ర్గం, త‌మ్మినేని వ‌ర్గం, సీదిరి స్వతంత్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారని టాక్. ధ‌ర్మాన ప్రసాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతూ.. ఇది మునిగిపోయే ప‌డ‌వ‌... మీ దారి మీరు చూసుకోండ‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం.

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిందని టాక్. టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్‌ వర్గం తిరుగుబాటు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పాలకొండ, రాజాం నియోజకవర్గల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులుకు అధికారం దక్కకుండా తానే ఆధిపత్యం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాతపట్నం సెగ్మెంట్లో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీరుపై పార్టీ క్యాడర్ రగిలిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీల ఎంపిక విషయంలో పార్టీ క్యాడర్ ఆమెపై తిరుగుబాటు చేసిందని వైసీపీ శ్రేణులు గుసగుసలాడాయి. ఏకంగా విజయసాయిరెడ్డికి కంప్లైంట్ చేస్తామనే దాకా పరిస్థితి వెళ్లింది.

ఉభయగోదావరి జిల్లాల్లోని అధికార పార్టీ వైసీపీలో విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య వివాదం రాజుకున్నట్లు టాక్. ఒక‌రినొక‌రు ఎప్పుడు దెబ్బకొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మంత్రి ఆళ్లనానితోనూ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు బాగా దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజాకు మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమంటున్నట్లు టాక్. ఇటీవల నామినేటెడ్ పదవులే ఇద్దరి మధ్య చిచ్చుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు నర్సాపురం సెగ్మెంట్లో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడి మధ్య కోల్డ్ వార్ కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నామినేటెడె పదవులు దక్కకపోవడంతోనే కొత్తపల్లి అలకబూనినట్లు టాక్. అటు గోపాలపురం నియోజకవర్గంలో మంత్రి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు వైసీపీ పార్టీలోనే చర్చ జరుగుతోంది. సీఎం సహాయ నిధుల సేకరణే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story