AP: కొలిక్కిరాని జగన్‌పై రాయి దాడి కేసు

AP: కొలిక్కిరాని జగన్‌పై రాయి దాడి కేసు
విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట వడ్డెర సంఘం నేతల ఆందోళన... మైనర్‌ను ఇరికించారని ఆరోపణ

జగన్‌పై గులకరాయి దాడి కేసు వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. నిందితులను పట్టుకునే సాకుతో అమాయకులను బలిచేస్తున్నారంటూ విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట వడ్డెర సంఘం నేతలు ఆందోళనకు దిగారు. తప్పుడు కేసు పెట్టి మైనర్‌ను ఇరికించారని మండిపడ్డారు. పోలీసుల వేధింపులతో వేముల దుర్గారావు కనిపించకుండా పోయి ఆరు రోజులైందని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. అదే సమయంలో తమపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై దాడి కేసును CBIకు అప్పగించాలని డిమాండ్ చేశారు.


సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అదుపులో తీసుకున్న దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని...వెంటనే చూపించాలంటూ అతని భార్య, కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నాయకులు విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు. అతను ఏ తప్పు చేయలేదని వాపోయారు. ఆందోళన చేస్తున్న దుర్గారావు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ కార్యాలయం నుంచి స్టేషన్ కి తరలించారు. ఏపీలో డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తప్పుడు కేసులతో నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులో తనను ఇరికించాలని చూస్తున్న పోలీసుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

సీఎంపై గులకరాయి డ్రామా కేసులో మైనర్ బాలుడని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. పులివెందుల వ్యక్తులను సాక్షులుగా పెట్టి వడ్డెర కులస్థుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ బర్త్ సర్టిఫికేట్ సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి డ్రామాలకు తెరలేపారన్నారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్న కాంతి రాణాను సీపీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న మైనర్‌ బాలుడు సతీష్‌ను తల్లిదండ్రులు కలిశారు. అనంతరం బయటకు వచ్చిన తల్లిదండ్రులు...తమ బిడ్డను భయపెట్టించి తప్పుడు సాక్ష్యం చెప్పించారని వాపోయారు. పోలీసు కస్టడీలో ఉన్న దుర్గారావును ఇంత వరకు కోర్టులో ప్రవేశపెట్టకపోవడం దారుణమని న్యాయవాది సలీం అన్నారు. ఆయనను చూపించాలని కోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ వేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story