AP: పీహెచ్‌సీలను గాలికొదిలేసిన జగన్‌

AP: పీహెచ్‌సీలను గాలికొదిలేసిన జగన్‌
పతాకస్థాయికి చేరిన జగన్ ప్రచారపిచ్చి..... జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల నిధులు

సీఎం జగన్‌ ప్రచార పిచ్చి పేద ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతోంది. పార్టీ ప్రచారం కోసం జగనన్న ఆరోగ్య సురక్షకు కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్న సర్కార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గాలికొదిలేస్తుంది. దీర్ఘకాలిక జబ్బులకు పరిష్కారం చూపాలన్న కేంద్ర మార్గదర్శకాలను తూతూ మంత్రంగానే అమలు చేస్తుంది. పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు వైద్యుల సేవలు అందక పోవడంతో రోగులకు నాణ్యమైన వైద్యం దక్కడం లేదు. దీర్ఘకాలిక రోగాలకూ చికిత్స అందిచాలనే ఉద్దేశంతో MBBSలకు అదనంగా స్పెషలిస్టు వైద్యుల సేవలు కూడా గ్రామీణులకు అందాలని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. దీని కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులను నియమించి నాణ్యమైన సేవలందించాలి. అయితే పార్టీ ప్రచారానికే పెద్దపీట వేసిన జగన్‌ సర్కార్‌ జగనన్న ఆరోగ్య సురక్షకు అగ్ర తాంబూలం అందిస్తుంది. వాటి కోసమే కోట్ల ఖర్చు పెట్టి PHCలను పట్టించుకోవట్లేదు. PHCల్లో MBBSల ద్వారా మాత్రమే గ్రామీణులకు వైద్య సేవలు అందుతున్నాయి. స్పెషలిస్టు వైద్యుల సేవలను భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి 2021లో PHCలోనూ స్పెషలిస్టు వైద్యుల సేవల కోసం నియామకాలు జరిగాయి. పీహెచ్‌సీల సంఖ్యను ప్రకారం 12 వందల మంది వరకు స్పెషలిస్ట్‌ వైద్యులు అవసరం అవుతారని అంచనా వేసి తొలివిడత కింద ఒప్పంద విధానంలో సుమారు 3 వందల 50 మందిని నియమించారు. వీరిలో జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థో, డెంటిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్టు, ఇతర వైద్యులు ఉన్నారు. ఒక్కో స్పెషాల్టీ వైద్యుడు చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు ఆరుగురు ఔట్‌ పేషంట్‌’విధానంలో రోగులకు వైద్య సేవలు అందించాలి. రోగుల అనారోగ్యం, వ్యాధి తీవ్రతను అనుసరించి రోగులు పెద్దాసుపత్రులకు వెళ్లేలా చేయాలి. ప్రతి స్పెషలిస్టు ఒకేరోజు ఉదయం ఒక పీహెచ్‌సీ, సాయంత్రం మరో పీహెచ్‌సీని సందర్శించి రోగులను చూడాలి. స్పెషలిస్టు వైద్యులు వారంలో 12 పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించాలి. నిర్దేశించిన రోజుల్లో స్పెషలిస్టు వైద్యులే నేరుగా పీహెచ్‌సీలకు వస్తున్నందున.. రోగులకు అనుకూలంగా ఉంటుందన్న విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రస్తుతం 350లో 50 మంది స్పెషలిస్టు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరి సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఎప్పుడు వస్తారో రోగులకే కాదు... PHCల్లోని వైద్యులకు కూడా తెలియడం లేదు.రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత నిర్వహించిన గ్రామ స్థాయిలోని వైద్య శిబిరాలు తూతూ మంత్రంగా జరిగాయి. బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడే వారే శిబిరాలకు ఎక్కువగా వచ్చారు. 50 లక్షల మందికి ఓపీ ద్వారా చికిత్స అందిస్తే..... కేవలం 80వేల మందినే ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. ఓపీ విధానంలో వైద్యుల వద్దకు వచ్చిన రోగుల్లో కనీసం పది శాతం మంది పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేయాల్సి ఉండగా.... కేవలం రెండు శాతం మందినే రిఫర్‌ చేశారు. తొలివిడత వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం 112 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది. మలివిడత వైద్య శిబిరాల నిర్వహణకు 75 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story