PAWAN: జైలుకు- బెయిల్‌కు మధ్య జగన్‌ జీవితం

PAWAN: జైలుకు- బెయిల్‌కు మధ్య జగన్‌ జీవితం
పవన్‌కల్యాణ్‌ వ్యంగ్యస్త్రాలు.... జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న పవన్‌

జైలుకు.. బెయిలుకు మధ్య జగన్‌ జీవితం ఊగిసలాడుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని. కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. ‘‘అమలాపురం క్లాక్‌టవర్‌ నుంచి చెబుతున్నా. జగన్‌.. నీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. నిన్ను జైలుకు పంపిస్తాం. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా.. ఎవరు మనల్ని ఆపేదని? మళ్లీ ఈరోజు చెబుతున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది? భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. కోనసీమను కలహాల సీమగా మార్చి.. కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు.” అని పవన్‌ ఘాటుగా హెచ్చరించారు.


జనసేన, జనసైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారని... కూటమి ప్రభుత్వం వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నాయకుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని. జనసేన నుంచి వెళ్లి పోతే తానేం చేయలేనని... వైసీపీ పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలని పవన్‌ అన్నారు, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పవన్‌ భరోసా ఇచ్చారు.

చంద్రబాబు ఘాటు విమర్శలు

వైసీపీ పాలనలో దళితులు దగాకు గురయ్యారని . తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారన్న ఆయన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గపు చర్యలను చూశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, బీసీలకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల్లో మిగతా వారికి అన్యాయం జరగకుండా వర్గీకరణకు కూడా కృషిచేస్తామని పి.గన్నవరం సభలోచెప్పారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కోనసీమలో వైసీపీ చిచ్చు పెట్టిందన్న పవన్ శాంతిభద్రతలను కాపాడతామని భరోసా ఇచ్చారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగిన సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌తోపాటు మొత్తం 11 హామీలను సమర్ధంగా అమలుచేస్తామని ఇరువురు నేతలు హామీఇచ్చారు. ఇదే సమయంలో జగన్‌ సర్కారుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు గత ఐదేళ్లలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story