ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వంపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారని.. ఇప్పటివరకు 19 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని లోకేష్ ఆరోపించారు. ఈ పాపం ఊరికే పోదని హెచ్పరించారు. పట్టాభిపై దాడి చేశారు.. అచెన్నాయుడిని అరెస్ట్ చేశారని విమర్శించారు. పోరాటం టీడీపీ-వైసీపీ మధ్య కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య పోరాటమన్నారు.

శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్య కాదని.. రాజకీయ హత్య అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు. ఈ విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయని... ఈ విషయంలో రక్షణ వ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్‌లో అనుమానం ఉందని చెప్పిన వ్యక్తులను ఇప్పటి వరకు విచారించక పోవడం విచారకరమన్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గొల్లలగుంటలో శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అభ్యర్ధి భర్త మృతిపై కుటుంబానికి పలు అనుమానాలున్నాయని, విచారణ ద్వారా నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో కాకుండా, మానవీయ కోణంలో చూడాలన్నారు నిమ్మగడ్డ.

అటు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇది కచ్చితంగా హత్యేనంటున్నారు.. రక్షణ కల్పిస్తామన్న పోలీసులు ఎక్కడికి వెళ్లారని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story