AMARAVATHI: అమరావతి రైతులకు కొత్త కష్టాలు

AMARAVATHI: అమరావతి రైతులకు కొత్త కష్టాలు
వెబ్‌ల్యాండ్‌లో పేరు నమోదు కాలేదని కొత్త కొర్రీ... డిజిటల్‌ సంతకం లేదంటూ వెనక్కి పంపుతున్న అధికారులు

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. భూ సమీకరణలో పొలాలు ఇచ్చి.. ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో పేరు నమోదు కాలేదని, డిజిటల్‌ సంతకం లేదంటూ... అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. వాటిని సరిచేయాలని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే సీఆర్డీఏ నుంచి లేఖ తీసుకురావాలని తహసీల్దార్ చెబుతున్నారు. దీంతో రైతులు అటూఇటూ తిరగలేక అష్టకష్టాలు పడుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన సమయంలో అప్పటి ప్రభుత్వం రైతులకు అన్ని అంశాల్లోనూ పూర్తిగా సహకరించింది. 9.3 కింద రైతుల నుంచి భూసమీకరణ విధానంలో భూములు తీసుకుంది. 9.14 కింద C.R.D.A.., రైతులతో ఒప్పందం చేసుకుంది. 9.18 కింద భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది.


ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనా అన్నింటినీ అప్పటి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించింది. అప్పట్లోనే రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లూ చేసింది. రైతులు భూములకు సంబంధించి వారి వద్ద ఉన్న ధ్రువపత్రాలను సీఆర్‌డీఏకు అప్పగించారు. మరికొందరు ప్లాట్లను వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. వారంతా ఇప్పుడు సీఆర్‌డీఏ అధికారుల వద్దకు వెళ్తే వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపి రిజిస్ట్రేషన్‌ చేయడానికి తిప్పించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులను... సాంకేతిక కారణాలతో ముప్పుతిప్పలు పెడుతున్నారని ఐకాస నేతలు మండిపడుతున్నారు.


సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లను రైతులు లేదా వారి రక్త సంబంధీకులకు ఎలాంటి రుసుము లేకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తామని... అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు తమ పిల్లల పేర్ల మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఎవరైనా రైతులు వెళ్తే అలా చేయటం కుదరదని... సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇక భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకంతో పాటు ఇతర వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పని కావటం లేదు. కొందరు రైతులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఏదో ఒక కారణం చూపి ఇదిగో అదిగో అంటూ తిప్పుతున్నారు.

భూమి మొత్తం సీఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లినందున అందుకు సంబంధించిన రికార్డులన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులకు సంబంధించి ఏమేం వివరాలు కావాలో ఒక ప్రతిపాదన పంపితే అందుకు అనుగుణంగా రైతులకు సంబంధిత ధ్రువపత్రాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story