TENSIONS: ఏపీ హోంమంత్రికి తీవ్ర ప్రతిఘటన

TENSIONS: ఏపీ హోంమంత్రికి తీవ్ర ప్రతిఘటన
దళిత యువకుడి ఆత్మహత్యతో తీవ్ర ఉద్రిక్తత.... హోంమంత్రి తానేటి వనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ

తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో దళిత యువకుడి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఫ్లెక్సీ వివాదంలో యువకుడు మహేంద్రను పోలీసులు అకారణంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి అవమానించారని దాన్ని తట్టుకోలేక అతను పురుగుల మందు తాగి చనిపోయాడని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్రంగా మండిపడ్డారు. పరామర్శించేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగు నాగార్జునను ఊరిలోకి రాకుండా అడ్డుకున్నారు. హోంమంత్రి తానేటి వనిత ఊళ్లోకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని గ్రామస్థులు, మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. చివరికి భారీ బందోబస్తు మధ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాగార్జున 20 లక్షల రూపాయల పరిహారం అందజేశారు. దళిత యువకుడు మహేంద్ర మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.


దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్య ఘటనతో తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు భగ్గుమంది. దొమ్మేరు గ్రామంలో ఈనెల 6న గడప గడప కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నాగరాజు, సతీష్‌ హోంమంత్రి తానేటి వనితకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ కట్టారు. అయితే హోంమంత్రి వనిత కార్యక్రమం తర్వాత ఫ్లెక్సీలో సతీష్‌, నాగరాజు ముఖాలు ఉన్న భాగాన్ని ఎవరో కత్తిరించారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొవ్వూరు సీఐ రమ్మన్నారంటూ పొలంలో ఉన్న మహేంద్రను పోలీసులు తీసుకెళ్లారు. అర్థరాత్రి వరకు ఠాణాలోనే ఉంచి ప్రశ్నించారు. ఫ్లెక్సీ వివాదంతో తనకు సంబంధం లేదని చెప్పినా వినకుండా మహేంద్రను స్టేషన్‌లోనే ఉంచడంతో మనస్తాపానికి గురైన మహేంద్ర పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. ఫలితం లేకపోవడంతో విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా పోలీసులపై స్థానికులు రాళ్లు, సీసాలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఏఎస్పీ తలకు గాయమైంది. అనంతరం బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. మహేంద్ర బలవన్మరణానికి పోలీసుల వేధింపులే కారణమన్న కుటుంబసభ్యులు యువకుడిని విడిపించాలని తానేటి వనితకు ఫోన్‌ చేసినా సరిగా స్పందించలేదన్నారు.


అసలు ఫ్లెక్సీ వివాదంతో తమకు సంబంధంలేదని చెప్పారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక MLA, హోంమంత్రి తానేటి వనిత, మరో మంత్రి మేరుగు నాగార్జున దొమ్మేరుకు వచ్చారు. అయితే సొంత నియోజకవర్గంలో గ్రామస్థుల నుంచి హోంమంత్రికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హోంమంత్రి ఊరిలోకి వస్తే ఊరుకోమని మహిళలు, యువకులు తేల్చిచెప్పారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తతల కారణంగా ఆమె మృతుని నివాసానికి వెళ్లకుండా కొద్దిదూరంలోనే ఆగిపోయారు. ఫోన్‌ చేసి మహేంద్రను విడిపించాలని కోరితే హోంమంత్రి కనీసం పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడ్డారు. తీరా ప్రాణాలు పోయాక ఎందుకు వచ్చారంటూ...ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. చివరకు మరో మంత్రి మేరుగు నాగార్జున పోలీసుల సహకారంతో మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్యే హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగ నాగార్జున గ్రామం నుంచి వెళ్లిపోయారు.


Tags

Read MoreRead Less
Next Story