CBN: టీడీపీ-జనసేన అన్‌స్టాపబుల్‌

CBN: టీడీపీ-జనసేన అన్‌స్టాపబుల్‌
వైసీపీ ఓటమి తథ్యమన్న తెలుగుదేశం అధినేత... జగన్‌ రాజకీయ వ్యాపారి అన్న చంద్రబాబు

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా..కదలి రా పేరిట సమావేశాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో బహిరంగ సభకు హాజరయ్యారు. మొదట NTR స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన ఆయనNTR, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగసభకు చేరుకున్న చంద్రబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. NTR ప్రాతినిధ్యం వహించిన తులసివనం లాంటి గుడివాడలో గంజాయి మొక్కలు పుట్టాయని ధ్వజమెత్తారు. బూతులు తిట్టేవారికే జగన్‌ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం-జనసేన పొత్తుతో జగన్ పనైపోయిందన్న చంద్రబాబు పులివెందులలో కూడా ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. అన్ని సర్వేలూ వైసీపీ ఓటమి తథ్యం అంటున్నాయని తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమన్న చంద్రబాబు..వికాసం పేరుతో పేదలకు పూర్తి న్యాయం చేస్తామని హామీఇచ్చారు.


అధికారంలోకి వచ్చాక 20 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు యువతకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీఇచ్చారు. సీఎం జగన్‌ ఒక రాజకీయ వ్యాపారి, అధికారం అంటే ఆయనకు దోపిడీ అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. గుడివాడలో వైసీపీ గంజాయి మొక్కలను ఏరేస్తామన్న ఆయన.. బూతుల సామ్రాట్‌ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుడివాడ అంటే మహానుభావులు పుట్టినగడ్డ అని. ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి సత్తా చాటిన గడ్డ ఇదని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ అంటే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సంక్షేమం. గుడివాడ నుంచే ఎన్టీఆర్‌ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని చంద్రబాబు అన్నారు. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే పార్టీ తెలుగుదేశం. టీడీపీ-జనసేన గెలుపు అన్‌స్టాపబుల్‌ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్లు వ్యాపారం పేరుతో అడుగుపెట్టి.. రాజ్యాధికారం చేపట్టారని.. ఆ తర్వాత దేశంలోని సంపదంతా కొల్లగొట్టారని.... అదే మాదిరిగా జగన్‌.. సొంత వ్యాపార సంస్థ పెట్టి ఎక్కడికక్కడ సంపదంతా దోచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్‌ మెంట్లు.. ఎక్కడ చూసినా దోపిడీలే అన్నారు.


ఇవన్నీ చాలవన్నట్టు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారని... అది భూ రక్షణ చట్టం కాదని.. భూ భక్షణ చట్టమన్నారు. ఇది అమల్లోకి వస్తే రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారని. ఇవాళ ఓట్ల దొంగలు పడ్డారని.. భవిష్యత్తులో భూముల దొంగలు పడతారని... టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తామని. పేదల ప్రభుత్వం కాదిది.. పేదల రక్తం తాగే ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా ప్రకటించారా? జాబు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story