AP: రైతుల్ని కాపాడే చర్యలేవీ?

AP: రైతుల్ని కాపాడే చర్యలేవీ?
జగన్‌ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ టీడీపీ....అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌.

వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు, వివిధ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. తుపాను నష్టం నుంచి రైతుల్నికాపాడేందుకు సరైన ముందస్తు చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో తెలుగుదేశం నేతలు నష్టపోయిన రైతులను ఓదార్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు...తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తడిసిపోయిన ధాన్యపు రాశులను, పడిపోయిన వరిచేలను... మాజీ MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పంటనష్టపోయిన రైతులను వర్ల కుమార్ రాజా పరామర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం మర్సుమల్లిలో దెబ్బతిన్న వరి, మిర్చి, బంతి, మొక్కజొన్నపొలాలను దేవినేని ఉమ పరిశీలించారు. బాపట్ల జిల్లా సంతమగులూరు మండలం కొమ్మలపాడులో తుపాను వల్ల నష్టపోయిన రైతులను అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పరామర్శించారు. బాపట్ల జిల్లా వేమూరులో మండలంలో పంట పొలాలు దెబ్బతినడంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు ఆవేదన వ్యక్తంచేశారు.

పర్చూరు మండలంలో నీటమునిగిన మిరప,పత్తి,పొగాకు పంటలను బాపట్లజిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. కాలువలు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నా వాటిని బాగుచేయలేదన్నారు...కాలువల్లో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని... ఫలితంగా చేతికొచ్చిన పంట నీటమునిగిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు... కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం అదుకోవాలని డిమాండ్ చేశారు..

మిగ్‌జ‌ాం తుఫానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం విఫలమయ్యారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజలకు ఆహారం, పునరావసంతో పాటు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. తుఫానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి జగన్‌ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ, నీటి పారుదల శాఖల మంత్రులు ప్రజలు, రైతుల గోడు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతకు వచ్చిన వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయ, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మిగ్‌జాం తుపాను రైతాంగానికి కన్నీటిని మిగిల్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నీటి మునిగి పంటలను తెలుగుదేశం నాయకులు పరిశీలించి రైతులను పరామర్శించారు. పంట చేతికందే దశలో నీటిపాలైందని రైతులు నాయకుల వద్ద తమ గోడు వెలిబుచ్చారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టం అంచనా వేయాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story