TDP: జగన్‌ పార్టీని బొంద పెట్టాలి

TDP: జగన్‌ పార్టీని బొంద పెట్టాలి
బీసీల లక్ష్యం అదే కావాలి... ప్రజలకుతెలుగుదేశం బీసీ నేతల పిలుపు

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను, అతని పార్టీని బొంద పెట్టడమే బీసీల ఏకైక లక్ష్యం కావాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి బలహీన వర్గాలపై దమనకాండ సాగిస్తున్నాడని మండిపడ్డారు. బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి పేరిట రూపొందించిన పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. NTR తెలుగుదేశం స్థాపనతో బీసీలకు కల్పించిన స్వర్ణయుగాన్ని జగన్ కాలరాశారని విమర్శించారు. మొదటి నుంచి బలహీనవర్గాలు తెలుగుదేశంకు మద్దతుగా ఉంటున్నాయనే వైఎస్ కుటుంబం వారిపై కక్షపెంచుకుని దాడుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. జగన్ పాలనలో 74మంది బీసీలు హత్యకు గురైతే 3వేల మందికిపైగా దాడులకు గురయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.


ప్రతి సభలో నా బీసీలు అంటూనే..జగన్‌ మోహన్‌ రెడ్డి బలహీన వర్గాల గొంతు కోస్తున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. సామాజిక న్యాయానికి పాతరేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే..బలహీన వర్గాల ఏకైక లక్ష్యం కావాలని టీడీపీ బీసీ నేతలు పిలుపునిచ్చారు. జగన్‌ హయాంలో బీసీలు పడుతున్న అవస్థలను ఓ పుస్తకం రూపంలో విడుదల చేశారు. బీసీల వెన్ను విరుస్తున్న జగన్‌ రెడ్డి పేరిట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు పుస్తకం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 36 సంక్షేమ పథకాలు రద్దు చేశారని పు‌స్తకంలో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన 14 లక్షల అసైన్డ్‌ భూముల్లో అత్యధిక భాగం బీసీలదేనని పుస్తకంలో ప్రస్తావించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో.34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించి..దాదాపు16 వేలకుపైగా రాజ్యాంగ బద్ధమైన పదవుల నుంచి దూరం చేశారని వివరించారు. 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు నిలిపివేసారన్నారు. దాదాపు 75 వేల 760 కోట్ల రూపాయల బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని వెల్లడించారు.


జగన్‌ ఏలుబడిలో పేరుకే బీసీలకు మంత్రి పదవులనీ పెత్తనమంతా రెడ్లదేనని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీలు యూనివర్సిటీ వీసీలుగా ఎందుకు పనికిరారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ కులగణన అంటూ జగన్‌ కొత్త నాటకానికి తెరదీశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం- జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్నివిధాల అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story