విగ్రహాల ధ్వంసంపై రాజకీయ మంటలు.. జగన్‌ సర్కార్‌పై విపక్షాల నిప్పులు

విగ్రహాల ధ్వంసంపై రాజకీయ మంటలు.. జగన్‌ సర్కార్‌పై విపక్షాల నిప్పులు
హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేసినట్లు చెప్పిన పాస్టర్ ప్రవీణ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసం ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో అసలు ముద్దాయి ప్రభుత్వమేనంటున్నాయి విపక్షాలు.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కుట్ర ఉందంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. దాడులను ఆపలేక టీడీపీ నేతలపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్, ఆయన బావ బ్రదర్‌ అనిల్‌ తీరు వల్లే రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. జగన్‌ పాలనలో మతమార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయనడానికి.. పాస్టర్‌ ప్రవీణ్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రవీణ్‌లాంటి వారిని రాష్ట్రంపైకి వదిలేసి ఎంపీ విజయసాయిరెడ్డి అండతో.. ఏపీలో మతమారణహోమం సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.

హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేసినట్లు చెప్పిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. తూతూ మంత్రంగా పాస్టర్ ప్రవీణ్‌పై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని, పోలీసులను నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ అమెరికా నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఆ నిధులతో సంఘ వ్యతిరేకశక్తుల ద్వారా.. ఎన్ని దేవాలయాలపై దాడులు చేయించారని కళా వెంకట్రావు నిలదీశారు. ప్రవీణ్‌ చక్రవర్తిని అరెస్టు చేసి నాలుగు రోజులైనా ఇంత వరకు ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీసులను ప్రశ్నించారు.. ప్రవీణ్‌ వెనుక ఎవరున్నారంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అటు ప్రవీణ్ చక్రవర్తితో జగన్ బావ అనిల్‌కు సంబంధాలున్నాయని మాజీమంత్రి చిన్నరాజప్ప ఆరోపించారు. ఇవన్నీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రజలు చెప్పినా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేయకుండా ఏడాది కాలంగా ఏం చేశారని ప్రశ్నించారు. అసలు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేశారా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సీఐడీ విచారణ జరుగుతోందా లేదో బయటపెట్టాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story