AP: ఆందోళన బాట పట్టిన జగన్‌ సొంత సైన్యం

AP: ఆందోళన బాట పట్టిన జగన్‌ సొంత సైన్యం
పలు జిల్లాల్లో సమ్మెకు దిగిన వాలంటీర్లు.... ప్రభుత్వానికి మింగుడుపడని వాలంటీర్ల ఆందోళనలు...

జగన్‌ ప్రభుత్వానికి సొంత సైన్యంలా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకూ కడుపు మండింది. సర్కార్‌ నిన్నమొన్నటిదాకా అన్ని కార్యక్రమాలకూ ఎక్కువగా ఆధారపడుతున్న వాలంటీర్లూ షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పనులకూ తమను వాడేస్తున్న సర్కారు...శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం లేదన్న కోపంతో వారు రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. రెండురోజుల క్రితం కృష్ణాజిల్లాలోని కొన్ని మండలాల వాలంటీర్లలో మొదలైన అసంతృప్తి జ్వాల కార్చిచ్చులా రాష్ట్రమంతా వ్యాపిస్తోంది.


అనంతపురం, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లోని మండలాల్లో వాలంటీర్లు ఎంపీడీవోలకు మంగళవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, పార్టీ పనుల కోసం వాలంటీర్లపైనే ఆధారపడుతున్న జగన్‌ సర్కారుకు ఇది పెద్ద షాక్‌. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 65 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. తమకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని 5వేల నుంచి 18వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా, ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండు చేస్తున్నారు.


విజయనగరం జిల్లా భోగాపురంలో 1, 2 సచివాలయాల పరిధిలోని 56 మంది వాలంటీర్లు ఆందోళనకు దిగారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి అప్పలనాయుడికి వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో 21 సచివాలయాల పరిధిలోని 314 మంది వాలంటీర్లు సమ్మెకు దిగారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎంఎల్‌ఎన్‌ ప్రసాద్‌కి వినతి పత్రం ఇచ్చారు. కాకినాడ జిల్లా గోకవరం మండలానికి చెందిన 160 మంది వాలంటీర్లు ప్రధాన రహదారి మీదుగా రెండు కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో పద్మజ్యోతికి సమ్మె నోటీసు అందించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 137 మంది వాలంటీర్లు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని బహిష్కరించి సమ్మెకు వెళుతున్నట్లుగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణ పరిధిలోని వాలంటీర్లు అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వడంతోపాటు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మార్కాపురంలో తనకు వినతులిచ్చిన వాలంటీర్లకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ హామీ ఇచ్చారు.


మరోవైపు ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆశావర్కర్లు కూడా ఆందోళన ఉద్ధృతం చేశారు. ఇప్పటికే సర్కారుకు సమ్మె నోటీసులు ఇచ్చిన వారు.. ఈ నెల 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులూ పోరుబాట పట్టారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మినిమమ్‌ టైంస్కేల్‌ అమలు చేయాలంటూ నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story