YCP: పెద్దిరెడ్డి అడ్డాలో బరితెగింపు

YCP: పెద్దిరెడ్డి అడ్డాలో బరితెగింపు
పుంగనూరు నియోజకవర్గంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలను అసభ్యంగా దూషించారు. వారు ధరించిన పసుపు చొక్కాలు విప్పించి, టీడీపీ జెండాలు, కండువాలు తీసేయించాకే పుంగనూరు నుంచి కదలనిచ్చారు. ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గమని... ఇక్కడ టీడీపీ జెండా ఎగరకూడదని వైసీపీ కార్యకర్త చెంగలాపురం సూరి టీడీపీ కార్యకర్తలను హెచ్చరించాడు. మిమ్మల్ని కొట్టకుండా పంపిస్తున్నామని.. దానికి సంతోషించడండని చెప్పడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ తతంగమంతా వీడియో తీయాలని పక్కనున్న వ్యక్తులకు చెప్పిన చెంగలాపురం సూరి... తన బరితెగింపును బహిరంగంగానే చాటాడు.


శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మాజీ సర్పంచి రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేశ్‌ అక్టోబరు 2న రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్‌ యాత్రగా బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగడానికి సైకిళ్లు ఆపారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త సూరి, మరికొందరితో అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు. ఇది పెద్దిరెడ్డి అడ్డా. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్లగలరా అంటూ బరితెగించాడు.

Tags

Read MoreRead Less
Next Story