Government Jobs : అక్కా చెల్లెళ్లకు మూడేసి ఉద్యోగాలు

Government Jobs : అక్కా చెల్లెళ్లకు మూడేసి ఉద్యోగాలు

వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. పేదరైతు ఇంట్లో పుట్టిన బిడ్డలు. పెళ్లిళ్లు అయినప్పటికీ పట్టు వదలలేదు. మంచి ఉద్యోగం సంపాదించి చదివిన చదువుకు సార్థకత చేకూర్చాలనుకున్నారు. రాసిన మూడు పరీక్షల్లో ప్రతిభ కనబరిచి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిని మండల ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌ గ్రామానికి చెందిన నిమ్మ సక్కుబాయి ఈదిరెడ్డి దంపతులకు వకుల, దివ్య అనే ఇద్దరు కుమార్తెలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం సాగింది.

ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. వకులను జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌కు చెందిన వంటేరు సంపత్‌రెడ్డికి, రెండో అమ్మాయి దివ్యను బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్‌రెడ్డికిచ్చి వివాహం చేశారు. వకుల గృహిణిగా, దివ్య జనగామ మండలం వెంకిర్యాల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం అగస్టు 2023లో గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం పరీక్షలు నిర్వహించగా, అక్కాచెల్లెళ్లు జనగామలో ఉంటూ ప్రిపేర్‌ అయ్యారు.

ఫిబ్రవరి 14న పీజీటీ, 29న జూనియర్‌ లెక్చరర్‌, మార్చి 1న టీజీటీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడింటిలోనూ అక్కాచెల్లెళ్లు ఎంపికయ్యారు. దీంతో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల్లో జాయిన్‌ అయ్యేందుకు వారు సిద్ధమయ్యారు. కాగా ఒక్క ఉద్యోగం పొందేందుకు నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు మూడేసి ఉద్యోగాలకు ఎంపిక కావటంతో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఉంటామని వారు ఆత్మస్థైర్యంతో చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story