చంద్రబాబుతో నాని భేటీ.. తన అసంతృప్తికి కారణమేంటో చెప్పిన కేశినేని
చంద్రబాబుతో కేశినేని సమావేశమయ్యారు. తన అసంతృప్తికి కారణాలుచెప్పారు.. న్యాయం చేస్తామన్న హామీ కూడా పొందారు.. పార్టీ వీడేది లేదని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్వీట్ల ప్రవాహం మాత్రం ఆపలేదు. అంతా సర్దుమణిగిందని భావిస్తున్న సమయంలో మళ్లీ నాని ట్వీట్ బాంబ్ పేల్చారు. పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ మాటలను ట్విట్టర్ లో పెట్టారు. దీంతో మరోసారి కేశినేని నాని వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయన పోరాటం ఎవరిమీద అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఎన్నికలలో ఘోర పరాజయం ఒక వైపు టీడీపీని కుదిపేస్తోంది. కేశినేని శ్రీనివాస్ వ్యవహారం మరింత అలజడి రేపుతోంది. ఇంతకుమందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టలపై స్పందించిన అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పిలిపించారు. ఈ సమావేశంలో తనకు జరిగిన అవమానాలను, పార్టీలో నేతల తీరును అధినేత దృష్టికి కేశినేని నాని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రాజధాని పరిధిలో ఎంపీగా ఉన్నా.. తనకంటే ఇతర నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కేశినేని ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇటీవల పార్లమెంటరీ పార్టీ పదవుల విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందన్న భావన వ్యక్తం చేశారట. గల్ల జయ్ దేవ్ , కింజరాపు రామ్మోహన్ నాయుడులకు కీలక పదవులు ఇచ్చి.. తనకు ప్రాధాన్యత లేని విప్ ఇవ్వడం అవమానించినట్టు ఉందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇందులో భాగంగానే ఆయన విప్ వద్దని.. ఎంపీగానే పనిచేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కేశినేని నాని అసంతృప్తికి అనేక కారణాలున్నాయన్నది మరికొందరి నేతల అభిప్రాయం. ఇటీవల విజయవాడలో తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి తన కార్యాలయాన్ని వినియోగించుకోవాల్సిందిగా నాని సూచించారు. ప్రస్తుత కేశినేని భవన్‌ను వినియోగించుకుంటారన్న తరుణంలో గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని వినియోగించుకోవటంపైన కూడా నాని ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు, గొల్లపూడికి పెద్ద తేడా ఏముందని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం విషయంలోనూ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం... దేవినేని ఉమామహేశ్వరరావు మాటకే విలువివ్వటం పట్ల కూడా ఆయన ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. కేశినేని శ్రీనివాస్ , చంద్రబాబుతో వన్ టూ వన్‌లో గంట సేపు మాట్లాడారు. పార్టీ పట్ల అభిమానంతో తన ఆవేదనే చెప్పారని తెలుస్తోంది.
కొంతకాలంగా కేశినేని వైఖరి అనుమానాస్పదంగా ఉందని పార్టీలోని కార్యకర్తలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూస్తున్న బీజేపీతో మరీ అంత చెలిమిగా ఉండాల్సిన అవసరం లేదని, అభివృద్ధికి నిధుల కోసం ఎంపీగా పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. పార్టీని సర్వనాశనం చేయాలనుకున్న బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదన్నది మరికొందరి భావనగా ఉంది. ఇటీవల వెంకయ్యనాయుడు, గడ్కరీ వంటి నేతలతో కలవడం పార్టీ వర్గాల్లో అనేమానాలకు తావిచ్చింది. అయితే తాను మర్యాదపూర్వకంగానే కలిశానని.. కానీ కొందరు పనిగట్టుకుని మరీ పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని కేశినేని సన్నిహితులు అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com