కీలక అంశంపై దృష్టి సారించిన తెరాస, వైసీపీలు..కలిసి కేంద్రంపై ఒత్తిడి

నియోజవర్గాల పునర్విభజనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కదలిక మొదలైందా..? ఈ విషయంలో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి తేనున్నారా... అధినేతలు ఇస్తున్న సంకేతాలతో నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందా... తాజా పరిణామాలు చూస్తే అవుననే చెప్పాలి.. బంపర్ మెజారీటి సాధించిన టిఆరెస్, వైసీపీలు.. ఇకపై పునర్వివిభన పైనే ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ...నియోజకవర్గాల పెంపు అంశంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనతో పాటే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని డిమాండ్ తెరమీదకి వచ్చింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలను 153 కు, ఏపీలో 175 స్ధానాలను 225కి పెంచాలని అనేక ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. అయితే అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాలతో రాష్ట్ర విభజన జరిగితే చాలన్న ఉద్దేశ్యంతో ఆనాడు ఈ అంశంపై నేతలు దృష్టిసారించలేదు. నియోజకవర్గాల పెంపు అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే పొందుపర్చడంతో ఇటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడిపెంచుతున్నాయి.
గతంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని మరో నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్ధానాల పెంపు ఫైల్ ప్రధాని మోదీ కార్యాలయానికి చేరింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే గత ప్రభుత్వ హయాంలోనే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇది బిల్లు రూపంలో వస్తుందని ఆశ పడ్డారు. కానీ అలా జరగకపోవడంతో ప్రస్తుతం ఉన్న నియోజక వర్గాలతోనే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడంతో నియోజక వర్గాల పునర్విభజన అంశం తెరపైకి తేనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు.
రాష్ట్ర విభజన తరువాత ఇతర పార్టీల నుంచి తెలంగాణలో టిఆరెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. గత ఎన్నికల నాటికే భారీగా చేరికలు జరిగాయి. అయితే సిట్టింగులకే సీట్లు ఇవ్వడం ద్వారా... కొత్తగా పార్టీలో చేరన వారికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో పలువురు నేతలు మళ్లీ కారు దిగారు. ఇక ఎన్నికల్లో భారీ విజయం సాధించాక మళ్లీ వలసలు పెరిగాయి. ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులు, పెరిగిన ఆశావాహులకు అవకాశాలు దక్కాలంటే నియోజక వర్గాల పునర్విభజన ఒక్కటే మార్గమని గులాబీ బాస్ ఆలోచన. అందుకే మళ్లీ నియోజక వర్గాల విభజన అంశంపై కేంద్రాన్ని కదిపేందుకు సిద్దమయ్యారు.
మరోవైపు ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ కూడా భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చింది కాబట్టి .. ఇటు తెలంగాణ ,అటు ఏపీలో కూడా నియోజక వర్గాల విభజన జరిగితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబందాలున్నాయి కాబట్టి .. నియోజక వర్గాల విభజన విషయంలో ఇద్దురు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే మోదీతో సమావేశం కానున్నట్టు సమాచారం.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com