ఆంధ్రప్రదేశ్

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు
X

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. వచ్చే రెండేళ్లలో ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని అన్నారు. ఏపీ,తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన విజయవాడలో బీజేపీ సభ్యత్వాల నమోదును ప్రారంభించారు.

ఏపీ, తెలంగాణలపై బీజేపీ ఫోకస్‌ చేసింది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలపడాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆపరేషన్‌ కమలంతో.. పార్టీ కేడర్‌లో జోష్‌ పెరిగింది. అదే జోష్‌ను సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కొనసాగించే వ్యూహాన్ని రచించారు బీజేపీ పెద్దలు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ నుంచే శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, కిషన్‌ రెడ్డి.. ఏపీలో సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారు.

విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు కిషన్‌ రెడ్డి..

తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రకాశ్‌ జవదేవకర్‌ ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించబోతోందన్నారు. బీజేపీలో చేరే ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.. ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లక్ష మంది సభ్యులను బీజేపీలో చేర్చుకునే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు బీజేపీ రాష్ట్ర సహా ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌. ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు..

తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో పాటు.. టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతల చేరికతో ఇప్పటికే బీజేపీ కేడర్‌లో జోష్‌ పెరిగింది. ఇక ఏపీలో ఒక్క సీటు నెగ్గకపోయినా.. నలుగురు టీడీపీ రాజ్యసభ్యులు కాషాయా కండువా కప్పుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, మాజీలు త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి నుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది..

Next Story

RELATED STORIES