అన్యాయం చేసిన వారి గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

వైసీపీ నేతల దాడులతో ఇబ్బంది పడుతున్న వారందరికీ తాను అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం కృష్ణా జిల్లాలో పార్టీ నేతలతో రివ్యూ నిర్వహించిన ఆయన.. తరువాత ప్రత్యేకంగా వైసీపీ బాధితులతో సమావేశమయ్యి వారికి భరోసా కల్పించారు. పేదలపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వైసీపీ నేతలు పెడుతున్న తప్పుడు కేసులకు త్వరలోనే సమాధానం చెప్పే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయ్ హత్య కేసును ఇప్పటి వరకు తేల్చలేకపోయిన వ్యక్తి మన రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ ఎద్దేవ చేశారు. తల్లిదండ్రి లేని అఖిల ప్రియపైనా, ఆమె భర్తపైనా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ పై అయితే రోజుకో కేసు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
అనుకూలంగా లేని వాళ్లపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విచారణ కూడా చేయకండా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేపై ఫోర్జరీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.
అన్యాయం చేసిన వారి గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు హెచ్చరించారు. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డువేస్తామని హామీ ఇచ్చారు. తన అనుభవంలో ఎన్నో అరచాకాలను చూశానని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే పార్టీ తరపున ప్రైవేటు కేసులు వేస్తాను అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com