మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం: దేవినేని ఉమా
టీవీ5 ప్రతినిధిపై అక్రమకేసులు పెట్టడంపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఓ స్కూళ్లో విద్యార్థులను బయటకు పంపించి.. తరగతి గదిని పోలీసులు వాడుకుంటున్నారని తెలిసి.. ఆ వార్త కవర్ చేయడానికి వెళ్లిన టీవీ5 ప్రతినిధిపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు తెలిజేసే మీడియాపై అక్రమ కేసులు పెట్టినందుకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తేయకపోతే న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు ఇదే అంశంపై కొల్లు రవీంద్ర స్పందించారు. మీడియాపైనా కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ5తో సహా ఇతర మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. మీడియా ప్రతినిధులపై అక్రమంగా నిర్భయ కేసులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. జగన్ ఓ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com