తొలినాళ్లలో బాధ్యతగా ఉంటే.. ఇంత ఉధృతి ఉండేది కాదు: చంద్రబాబు

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందువల్లే కేసులు అమాంతం పెరిగిపోయాయన్నారు. కరోనాపై తొలినాళ్లలోనే బాధ్యతగా వ్యహరించి ఉంటే ఇంత ఉధృతి ఉండేదికాదన్నారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కరోనా కట్టడికి ప్రతిపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సీఎం నుంచి ఎవ్వరూ మాస్కులు పెట్టుకోవాలనే ఆలోచనే లేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనాలన్నీ దెబ్బతీసే విధంగా ఉందన్నారు చంద్రబాబు. అసెంబ్లీ జరిగిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టలేదని విమర్శించారు.
కరోనా పరిస్థితుల్లో పదోతరగతి పరీక్షలు పెడతానటం సరికాదన్నారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు పదోతరగతి పరీక్షలు పెట్టలేదని, డైరెక్ట్‌గా పాస్ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. పిల్లల పట్ల ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రులు, పిల్లల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com